సమన్వయంతో మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకోవాలి

సమన్వయంతో మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

తొర్రూరు, ఆంధ్రప్రభ : సమన్వయంతో మునిసిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలని, దానికి ప్రభుత్వ పక్షాన సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.బుధవారం డివిజన్ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ శ్రావణ్ కుమార్ అధ్యక్షతన బడ్జెట్ సమావేశం నిర్వహించారు.ప్రత్యేక బడ్జెట్ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ హాజరు కాగా కమిషనర్ వక్కల శ్యాంసుందర్ బడ్జెట్ వివరాలను చదివి వినిపించారు.ఆదాయ, వ్యయం వివరాలతో పాటు వివిధ పథకాల ద్వారా ఆదాయాన్ని ఆశిస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూపొందించిన బడ్జెట్లో ఆదాయం రూ.17.84 కోట్లు కాగా వ్యయం 17.83 కోట్లుగా ఆమోదం తెలిపారు.

వివిధ పద్దులపై చర్చించి ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో సభ్యులు అభిప్రాయ పడ్డారు.2026– 27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.17.84 కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్ కు సభ్యులు ఆమోదం తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. బడ్జెట్ కు అనుగుణంగా నిధులు సమకూర్చుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నారు.

ప్రజలపై భారం పడకుండా ఆదాయాన్ని పెంచుకోవాలని సూచనలు చేశారు.మున్సిపల్ పట్టణ పరిధిలోని ప్రతి వార్డును అభివృద్ధి చేయాలని అందుకు ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు, వార్డులలో అంతర్గత అభివృద్ధి పనులు సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు, పట్టణ ప్రకృతి వనాల అభివృద్ధి, చెట్లు నాటడం, పచ్చదనం, పరిశుభ్రత పాటించడం, 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా షెడ్యూలు ప్రకారం కేటాయించిన అభివృద్ధి పనులు నిర్వహించాలన్నారు.

తమ వార్డు పరిధిలో ఏం జరుగుతుందనే అంశాలను గమనిస్తూ ఉండాలని, యువతీ యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ సేవిస్తూ ఎవరైనా తారసపడితే సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని తెలిపారు,ప్రతి పనిని నిర్వహించడానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కౌన్సిల్ సమావేశం ఆమోదం తీసుకొని పనులను ప్రారంభించాలని, పట్టణంలో ఎప్పటికప్పుడు ఉదయమే శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ యొక్క పన్నులను చెల్లించాలని, తద్వారా పట్టణ అభివృద్ధికి తమ భాగస్వామ్యం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ సోమ రజిని, కౌన్సిలర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply