2monthsstock | పెట్రోల్ కొరత భయం…ప్రజల్లో గందరగోళం

2monthsstock | పెట్రోల్ కొరత భయం…ప్రజల్లో గందరగోళం
2monthsstock | పుకార్లతో తెలంగాణలో ఆందోళన
బంకుల వద్ద భారీ రద్దీ, ట్రాఫిక్ సమస్యలు
అసలు కారణం ఏమిటి?
క్రెడిట్ విధానం మార్పు ప్రభావం
ప్రభుత్వ హామీ, పోలీసుల చర్యలు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్ కొరత వస్తుందన్న పుకార్లు తెలంగాణలో విపరీతమైన ఆందోళనకు దారితీశాయి. నిజానికి రాష్ట్రంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది, కానీ కొన్ని బంకులు “నో స్టాక్” బోర్డులు పెట్టడంతో వాహనదారులకు మరింత ఆందోళన కలిగింది. దీంతో “పెట్రోల్ లేదు” అన్న వార్త సుడిగాలి వేగంతో వ్యాపించింది. ఫలితంగా వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. డబ్బాలు, వాటర్ క్యాన్లు, గిన్నెలు చేతికి ఏది దొరికితే అది తీసుకుని వెళ్తున్నారు.

ఈ పుకార్లతో హైదరాబాద్‌లో రాత్రి నుంచి వాహనదారుల్లో గందరగోళం నెలకొంది. అటు ప్రభుత్వ యంత్రాంగానికీ నిద్ర లేకుండా చేసింది. బంకుల వద్ద వాహనదారులతో కిటకిటలాడడం, కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంకులపై పెరిగిన ఒత్తిడిని తట్టుకోలేక కొందరు డీలర్లు “నో స్టాక్” బోర్డులు పెట్టారు. ఈ పరిస్థితుల్లో పుకార్లు మరింత ఊపందుకుని, రాత్రి నుంచే పోలీసులు బంకుల వద్ద రద్దీని నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పెట్రోల్‌పై పుకార్లు రావడానికి అసలు కారణం ఆయిల్ కంపెనీలు క్రెడిట్ విధానాన్ని నిలిపివేయడమే. డీలర్లు ఇంతకుముందు అప్పుపై ఇంధనం తీసుకెళ్లేవారు, కానీ ఆయిల్ కంపెనీలు ముందుగానే అడ్వాన్స్ చెల్లించాలని చెప్పడంతో, డబ్బులు లేని కొందరు తమ బంకుల వద్ద “నో స్టాక్” బోర్డులు పెట్టి తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వాహనదారుల్లో ఆందోళన మొదలైంది.
ప్రభుత్వం వద్ద రెండు నెలల వరకు పెట్రోల్ నిల్వలు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు పోలీసు యంత్రాంగం వాహనదారులను బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి పొన్నం కూడా తెలిపారు. అయినప్పటికీ వాహనదారులు బంకుల వద్ద గ్యాలన్లు పట్టుకుని క్యూలలో నిలబడటం మాత్రం కొనసాగుతూనే ఉంది
