రూ.32.92కోట్లతో సీసీ రోడ్లు.

రూ.32.92కోట్లతో సీసీ రోడ్లు.
కూటమి ప్రభుత్వ పాలనలో ప్రగతి బాటలో పల్లెలు
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు .
రూ.71లక్షలతో కూనపరాజుపర్వలో సీసీ రోడ్లు ప్రారంభం
రెడ్డిగూడెం, ఆంధ్రప్రభ : మైలవరం నియోజకవర్గంలో రూ.32.92కోట్లతో సీసీ రోడ్లు నిర్మించామని, కూటమి ప్రభుత్వ పాలనలో పల్లెలు ప్రగతి బాట పడుతున్నాయని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా రెడ్డిగూడెం మండలంలోని కూనపరాజుపర్వలో రూ.71 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సిమెంట్ రహదారులను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ కూనపరాజుపర్వ గ్రామంలో రూ.1.5 కోట్లతో పనులు పూర్తి చేసిన గ్రామ నాయకత్వాన్ని అభినందించారు. ఇక్కడ బీసీ ఏరియాలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం టెండర్ దశకు వచ్చిందన్నారు. కూనపరాజుపర్వ గ్రామాభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇచ్చి మరిన్ని నిధులు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. గ్రామ నాయకత్వం రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా ఉంటూ, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు.
ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పర్వతాలను అధిరోహించినట్లే, ఒక్కో అభివృద్ధి పని పూర్తి చేస్తూ గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామన్నారు. అలానే మైలవరం నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ కింద రూ.15.50 కోట్లు మంజూరు చేశామన్నారు. సీఎం చంద్రబాబు , ప్రభుత్వ పెద్దలు చెప్పిన విధంగా అనారోగ్య బాధితులకు రాజకీయాలకు అతీతంగా ఆర్ధికసాయం అందజేయాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు స్పష్టం చేశారు. పల్లెపండుగకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ ఏపీకి భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. దీనివల్ల నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. విభజించబడిన ఏపీ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. అభివృద్ధి, సంక్షేమం దిశగా పరిపాలన ఉందన్నారు.
ప్రధాని మోడీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు కృషితో ఏపీకి జల్ జీవన్ పథకం 2.0 కింద రూ.11,500 కోట్లు కేంద్రం కేటాయించినట్లు వెల్లడించారు. 2028 డిసెంబర్ నాటికి ‘హర్ ఘర్ జల్’ సాకారం చేసేలా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఓయూ చేసుకున్నాయన్నారు. జల్ జీవన్ మిషన్ 2.0 ద్వారా 2028 నాటికి రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేయడం లక్ష్యమన్నారు.
గత ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా అటకెక్కించిందన్నారు. ఈ పథకాన్ని మైలవరం నియోజకవర్గంలో పూర్తిగా సద్వినియోగం చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.
