18people | ఆర్టీసీ బస్సు-లారీ ఢీ..18 మందికి గాయాలు

18people | ఆర్టీసీ బస్సు-లారీ ఢీ..18 మందికి గాయాలు
18people | ఆర్టీసీ బస్సు-లారీ ఢీ ఘటన
క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్
రోడ్డు భద్రతపై అధికారులకు సూచనలు
18people | రుద్రూర్, ఆంధ్రప్రభ : రుద్రూర్ మండల కేంద్రంలోని జె.ఎం.సీ కాలనీ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన ఉదయం సుమారు 11:15 గంటల సమయంలో రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. బోధన్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న టీజీ 16 జెడ్ 0102 నంబరు గల ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న టీఎస్ 22 టి 3348 నంబరు లారీని అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన వారిని తక్షణమే అంబులెన్సుల ద్వారా బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించిన కమిషనర్, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. రోడ్డు స్టాపర్లు, డివైడర్లు ఏర్పాటు చేయడం వంటి భద్రతా చర్యలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.

ప్రమాదం కారణంగా ఏర్పడిన ట్రాఫిక్‌ను పోలీసులు నియంత్రించి, జేసీబీ సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను రహదారి పక్కకు తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారికి బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని కూడా అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయబాబు, రుద్రూర్ ఎస్సై సాయన్న, ఇతర పోలీస్ అధికారులు, ఆర్టీసీ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

