సామాజిక న్యాయం కోసం పోరాడిన స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకం…

సామాజిక న్యాయం కోసం పోరాడిన స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకం…
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : సామాజిక న్యాయం, విద్యా ప్రబోధం, అనగారిన వర్గాల హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి స్ఫూర్తిని భావితరాలు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆకాంక్షించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో దొమ్మేటి వెంకటరెడ్డి 174వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, డిఆర్ఓ రాము నాయక్, బీసీ సంక్షేమ అధికారి జగ్గయ్య, బీసీ కార్పొరేషన్ ఈడి జాకీర్ హుస్సేన్‌తో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… దొమ్మేటి వెంకటరెడ్డి శెట్టి బలిజ సమాజానికి చెందిన ప్రముఖ నాయకుడిగా, ఆ వర్గం హక్కుల కోసం బ్రిటిష్ పాలన కాలంలోనే పోరాడిన మహోన్నత వ్యక్తిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. సమాజంలోని వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలనే లక్ష్యంతో ఆయన చేసిన కృషి ఆదర్శప్రాయమని కొనియాడారు. విద్య ప్రాధాన్యతను ఎంతో ముందుగానే గుర్తించిన వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా వయోజన విద్యకు ప్రోత్సాహం ఇచ్చి ప్రతి ఇంటికి అక్షరాస్యతను తీసుకెళ్లేందుకు కృషి చేశారని తెలిపారు.
సామాజిక చైతన్యం, హక్కుల కోసం పోరాట స్పూర్తిని ప్రజల్లో నింపిన నాయకుడిగా ఆయన నిలిచారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో, ముఖ్యంగా బీసీ సంక్షేమ శాఖ సమన్వయంతో నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుత కోనసీమ జిల్లాలోని బోడసకుర్రు గ్రామంలో దొమ్మెటి వెంకట్ రెడ్డి జన్మించినట్లు గుర్తుచేశారు.
కోనసీమ ప్రాంతంలో ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. బోడసకుర్రు – పాసర్లపూడి మధ్యనున్న వారధికి వెంకటరెడ్డి పేరు పెట్టాలని స్థానికులు కోరుతున్నారని, ఆయనను శెట్టి బలిజ సమాజ పితామహుడిగా ప్రజలు గౌరవిస్తున్నారని తెలిపారు. ఆయన ఆశయాలు, సేవా భావం భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.
