ఆ వర్గం ఎటువైపు…

ఆ వర్గం ఎటువైపు…
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: అరడుగుల బుల్లెట్‌కు ఆపద వచ్చిందంట. తన నియోజకవర్గంలో తనవాళ్లే తనను విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యారంట. మరి ఎమ్మెల్యే ఎవరు? ఎందుకు తనని సొంత పార్టీ శ్రేణులే వ్యతిరేకిస్తున్నారు? అసలు ఆ నియోజకవర్గంలో ఏమి జరుగుతోంది..?
హుజూరాబాద్ నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరును పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పట్టించుకోవడంలేదని, ఇప్పుడు వారు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. జమ్మికుంటలో సుమారు వంద మందికి పైగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు అత్యవసరంగా రహస్య సమావేశం నిర్వహించారు. ఇది నియోజకవర్గంలో సంచలనంగా మారింది.
కౌశిక్ రెడ్డి పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని, తన అజెండాతో ముందుకు వెళ్తున్నారని జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేపై మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోకుండా, పార్టీ ప్రతిష్ఠను మంటగలుపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం వ్యర్థమని వారు భావించినట్లు సమాచారం.
బీఆర్ఎస్ నేతల నిరసన సెగను ఇప్పుడు అధికార పార్టీ తమవైపు తిప్పుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వారిని జిల్లా మంత్రి, కాంగ్రెస్ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో బలమైన ముద్ర వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం హుజూరాబాద్‌లో జరుగుతున్న ఈ పరిణామాలు అధికార పార్టీకి పెద్ద అవకాశంగా మారవచ్చు. త్వరలోనే భారీ సంఖ్యలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యతిరేక వర్గం హస్తం గూటికి చేరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
