అన్నదాతలూ.. ఆందోళన వద్దు…

అన్నదాతలూ.. ఆందోళన వద్దు…
పంట నష్టానికి పరిహారం ద్వారా ప్రభుత్వం భరోసా
కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా మద్దతుకు చర్యలు
జిల్లాలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సుడిగాలి పర్యటన
గంపలగూడెం, ఆంధ్రప్రభ : అకాల వర్షాలు, గాలులు కారణంగా నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. జరిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారం ద్వారా అండగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ భరోసా కల్పించారు. శనివారం కలెక్టర్ లక్ష్మీశ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సందర్శించి నష్టం వాటిల్లిన పంటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడారు. గంపలగూడెం మండలంలోని తునికిపాడులో మొక్కజొన్న పంటను పరిశీలించారు.
ఇక్కడ దాదాపు 116 హెక్టార్లలో ఈ పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనావేసినట్లు వ్యవసాయ అధికారులు వివరించారు. పంట సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపైనా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మేడూరులో ఎనీటైమ్ మనీ (ఏటీఎం) విధానంలో పండిస్తున్న పంటలను పరిశీలించారు. రైతులకు ఏడాదిపాటు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో పంటల ద్వారా ఆదాయం వచ్చే ఈ విధానంపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరముందని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. దీనివల్ల పంటల వైవిధ్యంతో పాటు ఆదాయ స్థిరత్వం పెరుగుతుందని ఆయన తెలిపారు.

అదేవిధంగా 50 సెంట్ల విస్తీర్ణంలో సేంద్రియ విధానంలో సాగుచేస్తున్న వరిపంటను కూడా పరిశీలించి సాగు విధానాలను అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ ఎరువులు, దిగుబడి పరిస్థితులపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రసాయనాల వినియోగాన్ని తగ్గిస్తూ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా భూమి సారాన్ని కాపాడుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తికి దోహదపడుతుందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.

వినగడప వద్ద కట్లేరుపై ఉన్న వంతెనను పరిశీలించారు. ఎ.కొండూరు మండలం చైతన్య నగర్ సమీపంలో ఉన్న అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మార్కెట్ యార్డును రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్ సావల దేవదత్ తదితరులతో సందర్శించారు. కంచికచర్ల మండలంలోని కీసర వద్ద అరటి తోటను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ అకాల వర్షాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామని.. వివిధ పంటలకు సంబంధించి పారదర్శకంగా, జవాబుదారీతనంతో పంట నష్టాలను అంచనా వేయడం జరుగుతోందని.. తుది నివేదికల ఆధారంగా పరిహారం అందుతుందని, అన్నదాతలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.

ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేసేందుకు చొరవచూపనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పెసర, కంది వంటి పంటలకు కూడా మద్దతు ధర లభించేలా కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, గంపలగూడెం వ్యవసాయ అధికారి వి.హరీష్, రైతు సమాఖ్యల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
