కుమార్తె కోసం వెళ్తూ..

కుమార్తె కోసం వెళ్తూ..

  • అమరావతిలో విషాదం
  • పిడుగుపాటుకు తండ్రి మృతి

గుంటూరు, ఆంధ్రప్రభ : రాజధాని ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ ప్రకృతి విపత్తు తుళ్లూరులో ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రాజమండ్రికి చెందిన శ్రీనివాస్, అమరావతి రాజధాని పనుల్లో భాగంగా BSR కన్స్ట్రక్షన్ కంపెనీలో సర్వేయర్‌గా పనిచేస్తున్నారు. తన కుటుంబంతో కలిసి స్థానికంగానే నివసిస్తున్నారు. తుళ్లూరులోని మేరీమాత ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో తన కుమార్తె రెండో తరగతి చదువుతోంది. వర్షం తీవ్రతను గమనించిన శ్రీనివాస్, పాపను సురక్షితంగా ఇంటికి తీసుకురావాలనే ఉద్దేశంతో పాఠశాలకు వెళ్లారు.

క్షణాల్లో ఘోరం…

పాఠశాల ప్రాంగణంలో ఉండగానే ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగు పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్లముందే తండ్రి కుప్పకూలిపోవడంతో చిన్నారి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఈ అకాల వర్షం కారణంగా రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈదురు గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో తుళ్లూరు, మందడం, వెలగపూడి తదితర ప్రాంతాల్లో గంటల తరబడి చీకట్లు అలుముకున్నాయి.


పిడుగుపాటు సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని, సురక్షిత కట్టడాల లోపల ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ ప్రజలను కోరుతోంది.

Leave a Reply