దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్…

దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్…
బాపట్ల, ఆంధ్రప్రభ : బాపట్ల జిల్లాలోని దివ్యాంగులకు ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం దివ్యాంగ శక్తి పథకాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ బుధవారం ఘనంగా ప్రారంభించారు. బాపట్ల న్యూ బస్ డిపో వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి విమల, దివ్యాంగుడితో కలిసి పచ్చ జెండా ఊపి బస్సు సర్వీసులను ప్రారంభించారు. పథకం ప్రారంభం అనంతరం, కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి విమల, డి ఐ పి ఆర్ ఓ వెంకటరమణ స్వయంగా దివ్యాంగులతో కలిసి బాపట్ల నుండి జిల్లెల్లమూడి గ్రామం వరకు బస్సులో ప్రయాణించారు.
ప్రయాణ సమయంలో కలెక్టర్ దివ్యాంగుల పక్కన కూర్చుని, వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న ప్రభుత్వ పథకాలు, ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఒక ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పథకం అమలు తీరును పరిశీలిస్తూ, బస్సులో ఉన్న దివ్యాంగుల సదరం సర్టిఫికెట్లను ఆయనే స్వయంగా తనిఖీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ ఉచిత ప్రయాణ ఫలాలు అందాలని, ఎక్కడా ఇబ్బందులు కలగకూడదని అధికారులను ఆదేశించారు.

బస్సు సర్వీసు ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు పూర్తి అవుతుంది ఆదాయం ఎంత వస్తుంది శ్రీ శక్తి పథకం అమలు జరుగుతుందా, బస్సులో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిందా అంటూ కండక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల సాధికారతకు, వారి సామాజిక భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. దివ్యాంగ శక్తి పథకం ద్వారా వారు ఆర్థిక భారం లేకుండా ప్రయాణించవచ్చు. జిల్లాలోని ప్రతి అర్హుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, జిల్లా యంత్రాంగం, పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు.

