వాట్సాప్ ద్వారా టికెట్ల బుకింగ్‌కు ప్రాధాన్యం

వాట్సాప్ ద్వారా టికెట్ల బుకింగ్‌కు ప్రాధాన్యం

దేవాలయాల్లో అమలు చేయాల్సిందే
50 శాతం టికెట్లు ‘మనా మిత్ర’ ద్వారా ఇవ్వాలి
ఎండోమెంట్స్ శాఖ ప్రత్యక ఆదేశాలు

ఎన్టీఆర్ ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలోని దేవాలయాల్లో డిజిటల్ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు సేవలను సులభతరం చేయడానికి వాట్సాప్ గవర్నెన్స్ ప్లాట్‌ఫాం మనా మిత్ర ద్వారా టికెట్ల బుకింగ్‌ను విస్తరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ రామ చంద్రబాబు మోహన్ సోమవారం సర్క్యులర్ మెమో విడుదల చేశారు.

వాట్సాప్ ద్వారా 50% టికెట్లు

దేవాలయాల్లో అందుబాటులో ఉన్న మొత్తం టికెట్లు, సేవలలో కనీసం 50 శాతం వాట్సాప్ గవర్నెన్స్ (మనా మిత్ర) ద్వారా మాత్రమే బుక్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌంటర్ కోటా పూర్తైన తర్వాత భక్తులు తప్పనిసరిగా వాట్సాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేలా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వాట్సాప్ కోటాలో ఉన్న టికెట్లను ఏ పరిస్థితుల్లోనూ కౌంటర్ కోటాగా మార్చకూడదని స్పష్టం చేశారు. దేవాలయాల్లో డిజిటల్ గవర్నెన్స్‌ను బలోపేతం చేయడమే ఈ నిర్ణయ లక్ష్యమని తెలిపారు. దేవాలయాల్లో భక్తులకు సులభంగా టికెట్లు బుక్ చేసుకునేలా సిబ్బంది సహాయం అందించాలి.

ఆలయ ప్రాంగణంలో ఇంటర్నెట్ సదుపాయం..

రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో వాలంటీర్లు, సిబ్బందిని నియమించి భక్తులకు వాట్సాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేలా సహాయం చేయాలని మనా మిత్ర” సేవలను వినియోగించే విధంగా భక్తులకు అవగాహన కల్పించాలని ప్రత్యేక సూచనలు చేశారు. కౌంటర్, ఆన్‌లైన్‌, వాట్సాప్ ద్వారా అమ్ముడైన టికెట్ల వివరాలను నమోదు చేసేందుకు త్వరలో ప్రత్యేక ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా రోజువారీ లావాదేవీలను పర్యవేక్షిస్తామని చెప్పారు.

కమిషనర్ ప్రత్యేక పర్యవేక్షణ

ఈ అప్లికేషన్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ కోటా వినియోగం, ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారుల పనితీరు వంటి అంశాలను కమిషనర్ స్థాయిలో పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వం డిజిటల్ సేవలకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని ఎగ్జిక్యూటివ్ అధికారులకు సూచించారు. అమలులో ఎలాంటి నిర్లక్ష్యం లేదా మార్పులు జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు.

Leave a Reply