నా జీవితం ప్రజాస్వామ్యానికి అంకితం..

నా జీవితం ప్రజాస్వామ్యానికి అంకితం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి : బుల్లెట్ నుంచి బ్యాలెట్ వరకు సాగిన‌ తన జీవిత ప్రయాణం ప్రజాస్వామ్య శక్తిని ప్రతిబింబిస్తుందని మంత్రి సీతక్క అన్నారు. తన జీవితాన్ని ప్రజాస్వామ్యానికి అంకితం ఇస్తున్నానని చెప్పారు. అయితే ప్రజాస్వామ్య మార్గంలో సాధించే మార్పే శాశ్వతమని ఆమె అన్నారు. ఒకప్పుడు న్యాయస్థానంలో నిందితురాలిగా నిలిచిన తాను, కాలక్రమంలో అదే కోర్టులో న్యాయవాదిగా వాదనలు వినిపించిన సందర్భం తన జీవితంలో కీలక మలుపుగా నిలిచిందని గుర్తు చేశారు.

భారత రాజ్యాంగం కల్పించిన అవకాశాల వల్లే ఈ మార్పు సాధ్యమైందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ముందంజలో ఉన్న మహిళా నాయకులను ఒక వేదికపైకి తీసుకువచ్చిన షీ స్పార్క్స్ 2026 కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల‌ మంత్రి డా. ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క శనివారం పాల్గొని ప్రసంగించారు. ఓ జాతీయ మీడియా సంస్థ ఆధ్వర్యంలో ఢిల్లీ ఐఐటీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో తన జీవితం, మంత్రిగా తీసుకున్న కీలక నిర్ణయాలపై నిర్వాహకులు అడిగిన పలు ప్రశ్నలకు తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

ఈ సందర్భంగా సమాజంలో మార్పు తీసుకురావడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో ముందుకు సాగుతున్న మహిళా నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన నిర్వాహకులను ఆమె అభినందించారు. వ్యాపారవేత్తలు, పరిశోధకులు, ఐటీ నిపుణులు, రచయితలు, కళాకారులు, పరిపాలనాధికారులు వంటి అనేక రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న మహిళలు ఈ సమావేశంలో పాల్గొనడం ప్రేరణనిచ్చే విషయమని అన్నారు. ఇలాంటి వేదికలు మహిళల నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆమె తెలిపారు.

తాను రాజకీయ కుటుంబం నుంచి రాలేదని, ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామానికి చెందిన ఆదివాసీ కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ప్రజాసేవలోకి వచ్చానని మంత్రి గుర్తుచేశారు. ఒకప్పుడు అన్యాయం, దోపిడీకి వ్యతిరేకంగా నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన తన జీవితం తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం పెరిగి ప్రధాన ప్రవాహంలోకి వచ్చానని తెలిపారు. విద్య ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చని నమ్మి న్యాయ విద్యను అభ్యసించి న్యాయవాదిగా పనిచేశానని, అనంతరం ప్రజల సేవ కోసం ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.

తన జీవిత ప్రయాణాన్ని “బుల్లెట్ నుంచి బ్యాలెట్ వరకు” అని పేర్కొంటూ, ప్రజాస్వామ్యం ద్వారా సాధించే మార్పు శాశ్వతమని మంత్రి సీతక్క అన్నారు. ఒకప్పుడు న్యాయస్థానంలో నిందితురాలిగా నిలిచిన తాను, తర్వాత అదే కోర్టులో న్యాయవాదిగా నిలిచిన సందర్భం తన జీవితాన్నిమలుపు తిప్పింద‌న్నారు. భారత రాజ్యాంగం కల్పించిన అవకాశాల వల్లే ఇది సాధ్యమైందని ఆమె తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం ద్వారా రాష్ట్రంలో 46 లక్షలకుపైగా మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి సామాజిక-ఆర్థిక మార్పుకు దోహదపడుతున్నారని చెప్పారు.

మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీలు, చిన్న మ‌ధ్య‌త‌ర‌హా వ్యాపారాలకు రుణాలు, మార్కెట్ అవకాశాలు కల్పిస్తూ మహిళలను ఉద్యోగార్ధులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతున్నామ‌ని పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి విధానం ద్వారా మహిళలకు పెద్ద స్థాయిలో వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. స్వయం సహాయక సంఘాలు బస్సులు నిర్వహించడం, కమ్యూనిటీ క్యాంటీన్లు నడపడం, వరి కొనుగోలు కేంద్రాలు నిర్వహించడం, పాఠశాల యూనిఫార్మ్‌లు తయారు చేయడం వంటి అనేక రంగాల్లో ముందంజలో ఉన్నాయని తెలిపారు.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన “ఇందిరా మహిళా శక్తి బజార్” ద్వారా గ్రామీణ మహిళలు తమ ఉత్పత్తులను నగర మార్కెట్‌కు నేరుగా విక్రయించే అవకాశాన్ని కల్పించామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు బలపడతాయని, సమాజం అభివృద్ధి చెందుతుందని మంత్రి సీతక్క అన్నారు. దేశ అభివృద్ధిలో మహిళలు కేవలం భాగస్వాములు మాత్రమే కాకుండా మార్పుకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ… గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలకు అవకాశాలు కల్పించేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన ఆదివాసీ అమ్మాయి మంత్రి కాగ‌లిగింద‌ని… సంకల్పం, విద్య, ప్రజాస్వామ్యం ఏ జీవితాన్నైనా మార్చగలద‌నిపేర్కొన్నారు.

Leave a Reply