విశ్వ విద్యాలయాలు .. విద్యార్థులకు దిక్సూచి

విశ్వ విద్యాలయాలు .. విద్యార్థులకు దిక్సూచి
కర్నూలు, బ్యూరో, ఆంధ్రప్రభ : విశ్వవిద్యాలయాలు దేవాలయాల్లాంటివని, అవి విద్యార్థులకు దిక్సూచి లాగా మార్గనిర్దేశం చేస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యుడు పి వెంకటప్పపేర్కొన్నారు. విద్యాసంస్థల పవిత్రతను కాపాడుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ సెమినార్ హాల్‌లో రాయలసీమ యూనివర్సిటీ, కర్నూల్ క్లస్టర్ యూనివర్సిటీ అధికారులతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు, ఎస్టీ సంఘాల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు యూనివర్సిటీల్లో ఎస్టీ విద్యార్థులకు ఎక్కడా అన్యాయం జరగకుండా చూడాలని తాను పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు.
ఎస్టీ విద్యార్థుల సమస్యలపై సమీక్ష.
సమీక్షలో భాగంగా యూనివర్సిటీలో ఎస్టీ విద్యార్థులకు ఎన్ని అడ్మిషన్లు ఇచ్చారు, ఎన్ని పీహెచ్డీ, ఎం.ఫిల్ డిగ్రీలు ప్రదానం చేశారు, ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్ వసతులు, విద్యార్థుల సమస్యలు వంటి అంశాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఔట్‌సోర్సింగ్, పర్మనెంట్ ఉద్యోగులలో ఎస్టీ వర్గాల పరిస్థితి, వారికి ఉన్న సమస్యలపై కూడా చర్చించారు.
ఉద్యోగుల వేతనాలపై వినతులు
ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు తమకు సరైన జీతభత్యాలు ఇవ్వడం లేదని, ఇతర ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందడం లేదని కమిషన్ సభ్యునికి విన్నవించారు. ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని కోరారు. దీనిపై యూనివర్సిటీ అధికారులు స్పందిస్తూ ప్రభుత్వ నిబంధనలు, కోర్టు ఆదేశాల మేరకే వేతనాలు చెల్లిస్తున్నామని తెలిపారు.
అంబేద్కర్ పేరుతో లైబ్రరీకి డిమాండ్
సమావేశంలో పాల్గొన్న విద్యార్థులు యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహ స్థాపన కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కూడా స్థానం కల్పించాలని కోరారు. అలాగే యూనివర్సిటీ లైబ్రరీకి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎం.ఎడ్, బి.ఎడ్ వంటి విద్యకు ఉపయోగకరమైన కొత్త కోర్సులు ప్రారంభించాలని కూడా కోరారు. యూనివర్సిటీలో జరిగే పనులను టెండర్ల ద్వారా పారదర్శకంగా నిర్వహించాలన్నారు.
లా కోర్సుల ఏర్పాటుకు సూచనలు
విద్యార్థుల అభ్యర్థనలను సానుకూలంగా స్వీకరించిన ఎస్టీ కమిషన్ సభ్యుడు పి. వెంకటప్ప, లా కోర్సులు సహా విద్యార్థులకు ఉపయోగపడే ప్రాధాన్య కోర్సులను ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ అధికారులకు సూచించారు. విద్యార్థులకు చదువుకునే అవకాశాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హామీ
ఉద్యోగుల సమస్యలపై స్పందిస్తూ, వారికి ఎటువంటి నష్టం జరగకుండా వైస్ ఛాన్సలర్ పరిధిలో పరిష్కరించాల్సిన అంశాలను పరిశీలించాలని సూచించారు. యూనివర్సిటీ ఆస్తులను రక్షిస్తూ అవసరమైన నిధులు సమకూర్చేందుకు రాష్ట్ర గవర్నర్ ద్వారా కూడా కృషి చేస్తామని తెలిపారు. న్యాయస్థానాల ఆదేశాలను పాటిస్తూ ఉద్యోగుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
యూనివర్సిటీ పనుల్లో పారదర్శకత
ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ Prof. Venkat Basavaraju మాట్లాడుతూ యూనివర్సిటీలోని ఉద్యోగుల వివరాలు, ప్రస్తుత కోర్సులు తదితర అంశాలను కమిషన్ సభ్యునికి వివరించారు. ప్రభుత్వ నిబంధనలు, కోర్టు ఆదేశాల మేరకే ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నామని చెప్పారు. ఎవరి పట్లా కక్షసాధింపు చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. యూనివర్సిటీలో జరిగే అన్ని పనులు టెండర్ ప్రక్రియ ద్వారానే పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
క్లస్టర్ యూనివర్సిటీ వివరాలు
సమావేశంలో క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీనివాసులు మాట్లాడుతూ కర్నూలులోని కె.వి.ఆర్ సిల్వర్ జూబ్లీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల తదితర సంస్థలతో క్లస్టర్ యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఇందులో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను కమిషన్ సభ్యునికి తెలియజేశారు.
ఈ సమావేశంలో రెక్టర్ ఎన్‌సీకే నాయక్, రిజిస్ట్రార్ విజయకుమార్ నాయుడు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సురేష్, బోధన సిబ్బంది, భోదనేతర సిబ్బంది, విద్యార్థులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని తమ సమస్యలను కమిషన్ సభ్యునికి వివరించారు.
