రైతుల సొమ్ముతో రాహుల్ బంధు పథకం…

రైతుల సొమ్ముతో రాహుల్ బంధు పథకం…
- రైతుబంధు నిధులను రాహుల్ బంధుకు పంపుతున్నారు..
- నాలుగు సార్లు రైతుబంధును ఎగ్గొట్టిన కాంగ్రెస్..
- సీఎం సీటును కాపాడుకోవడంపైనే రేవంత్ దృష్టి
- ఆరు గ్యారెంటీల అమలు చట్టబద్ధతకు ప్రభుత్వంపై ఒత్తిడి..
- భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిరిసిల్ల, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ బంధు అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. సోమవారం సిరిసిల్లలో జరిగిన నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ రాహుల్ బంధు పథకాన్ని రైతులకు ఇచ్చే రైతు బంధు నిధులతో మొదలు పెట్టాడని, ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు పథకం మాత్రం తెలంగాణలో పక్కగా రేవంత్ రెడ్డి అమలు చె స్తున్నారని విమర్శించారు.
రాహుల్ గాంధీ కుటుంబానికి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా వేల కోట్ల రూపాయలు పంపించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని, అందుకే రాహుల్ గాంధీ కోసం బ్రహ్మాండమైన కొత్త పథకాన్ని తెలంగాణలో తెచ్చారన్నారు. రాష్ట్రంలోని రైతన్నలంతా తమకు రైతు బంధు వస్తుందని, కాంగ్రెస్ పార్టీ పెంచి ఇస్తామన్న నిధులను ఇస్తుందని ఎదురు చూస్తూ ఉంటే.. రేవంత్ రెడ్డి రైతు బంధును ఎగగొడుతున్నాడన్నారు. ఇప్పటికే మూడుసార్లు రైతు బంధును ఎగగొట్టిన రేవంత్ రెడ్డి, ఈసారి కూడా రైతు బంధును ఎగగొట్టాడని మండిపడ్డారు.
రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధును పక్కన పెట్టి రాహుల్ బంధు పథకం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సీటును కాపాడుకుంటు న్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తన సీఎం పీఠం కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీకి, ఆయన కుటుంబానికి అడ్డగోలుగా డబ్బులు పంపుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి సామంత రాజులా రాహుల్ గాంధీ ఢిల్లీ గద్దెకు కప్పం కడుతూ ఉన్నారన్నారు. రాహుల్క చెల్లించాల్సిన కప్పం గురించి పేదల భూములు గుంజుకొని, పేదల ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందుకే హైదరాబాద్ నుంచి మొదలుకొని ఖమ్మం దాకా అన్ని చోట్ల 7 ఎదల ఇళ్లను కూలగొట్టి మరి వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చి డిక్లరేషన్ల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీతోపాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వంటి ప్రతి ఒక్కరూ తెలంగాణకు వచ్చి 100 రోజుల్లోనే తాము ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
అందుకే రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను మొదటి క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని చట్టబద్ధత కల్పించి.. అమలు చేస్తామని రాహుల్ గాంధీతో సహా అందరూ చెప్పిన మాటలను గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు బాకీ పడిన ఆరు గ్యారంటీల చట్టం ఈ సమావేశాల్లో ప్రస్తావిస్తామని, ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును తీసుకువచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు.
