H-index 50 | రాష్ట్ర ప్రభుత్వ కృషికి వర్సిటీల పాత్ర కీలకం

H-index 50 | రాష్ట్ర ప్రభుత్వ కృషికి వర్సిటీల పాత్ర కీలకం

మహిళా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్

H-index 50 | తిరుపతి ( రాయలసీమ) ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్, నైపుణ్యాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి, క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు వంటి అంశాలలో చేస్తున్న ప్రత్యేక కృషిలో యూనివర్సిటీలు కీలక భాగస్వామ్యులుగా మారి అవసరమైన పరిశోధలనల సమన్వయంతో ప్రగతిపథంలో ముందుకు సాగడానికి సిద్ధం కావాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపు నిచ్చారు. స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో శనివారం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఉమా వెన్నం అధ్యక్షత న జరిగిన యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవంలో ఆయన ఛాన్సలర్ హోదాలో పాల్గొన్నారు.

ఆ కార్యక్రమంలో భాగంగా డి ఆర్డిఓ విశ్రాంత శాస్త్రవేత్త శశికళ సిన్హా కు యూనివర్సిటీ తరపున గౌరవ డాక్టరేట్ ను గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రదానం చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ విద్యావంతులైన మహిళలు కుటుంబాలను బలోపేతం చేయడంతో పాటు సమాజం, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడతారన్నారు. ఆధునిక సాంకేతిక రంగాల్లో నైపుణ్యం అవసరమని, ప్రస్తుతం ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, పునరుత్పాదక శక్తి వంటి ఆధునిక రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు.

H-index 50 |

రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్, నైపుణ్యాభివృద్ధి మరియు సాంకేతిక రంగాల్లో కీలక చర్యలు చేపడుతున్నదని, ఇందులో భాగంగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయడం ద్వారా ఆధునిక పరిశోధనకు ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. పర్యావరణ పరిరక్షణలో విశ్వవిద్యాలయాల పాత్ర కీలకమని, గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి ప్రస్తుతం అత్యంత అవసరమన్నారు. సౌర, గాలి విద్యుత్ వంటి పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రం పర్యావరణ పరిరక్షణలో ముందంజలో ఉందని తెలిపారు.

H-index 50 | కొత్త ఆలోచనలను స్వీకరించాలి…

విశ్వవిద్యాలయాలు పునరుత్పాదక శక్తి, స్థిరమైన వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులు ప్రతి నిత్యం నేర్చుకునే అలవాటు కొనసాగించాలని, కొత్త ఆలోచనలను స్వీకరించాలని, పారిశ్రామికత దిశగా ముందుకు సాగాలని సూచించారు. డిగ్రీలు స్వీకరించడం జీవిత ప్రయాణానికి ముగింపు కాదని, కొత్త ప్రారంభమని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం మహిళా సాధికారతను పెంపొందిస్తూ దేశ అభివృద్ధికి మరింత సేవలందించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.

గౌరవ డాక్టరేట్ గ్రహీత శశికళ సిన్హా మాట్లాడుతూ యూనివర్సిటీలో అభ్యసించే విద్యను తమ ఉజ్వల భవిష్యత్తుకు లాంచ్ పాడ్ గా ఉపయోగించుకుని ఉన్నతస్థాయికి దూసుకుపోవాలని అన్నారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం దాదాపు 100 పరిశోధన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, అధ్యాపకులు, పరిశోధకులు 1000కు పైగా పరిశోధన పత్రాలను ప్రచురించగా, వాటికి 13,000కు పైగా సైటేషన్లు లభించాయని తెలిపారు. విశ్వవిద్యాలయానికి h-index 50 నమోదైందని వెల్లడించారు.

అదేవిధంగా 80 పేటెంట్లు ప్రచురించబడగా, 22 పేటెంట్లు మంజూరయ్యాయి అని చెప్పారు. ప్రస్తుతం 8 ఇన్నోవేషన్, ఇన్క్యుబేషన్ కేంద్రాలు పనిచేస్తున్నాయని, హెల్త్ టెక్నాలజీ, సస్టైనబుల్ మెటీరియల్స్, డయాగ్నోస్టిక్స్, క్లీన్ ఎనర్జీ, మహిళల ఆరోగ్యం వంటి రంగాల్లో విద్యార్థులు, పరిశోధకులు వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. స్నాతకోత్సవంలో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరల్ కోర్సులకు చెందిన మొత్తం 2,591 మంది విద్యార్థినులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా డిగ్రీలు ప్రదానం చేశారు.

వీరిలో 121 మంది పరిశోధకులకు పీహెచ్‌డీ పట్టాలు అందజేశారు. ప్రతిభ కనబరిచిన 99 విద్యార్థినులకు గోల్డ్ మెడల్స్, ఇద్దరికి సిల్వర్ మెడల్స్ తో పాటు పలు బుక్, నగదు బహుమతులు అందజేశారు, ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్, ఎస్పి ఎల్. సుబ్బారాయుడు, మున్సిపల్ కమిషనర్ ఎన్.మౌర్య, స్థానిక ఎం ఎల్ ఏ ఆరణి శ్రీనివాసులు రిజిష్ట్రార్ ఆర్ ఉష, డీన్ లు ప్రొఫెసర్ ఉమా ప్రొఫెసర్ వాణి, రాష్ట్ర క్లీన్ అండ్ గ్రీన్, బ్యూటిఫికేషన్ ఛైర్మన్ సుగుణమ్మ యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply