బంగారుపేటలో కార్డన్ సెర్చ్..

బంగారుపేటలో కార్డన్ సెర్చ్..
350 లీటర్ల బెల్లం ఊట, 50 లీటర్ల నాటుసారా ధ్వంసం
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి: అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : మాదక ద్రవ్యాల నియంత్రణ లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన “ఆపరేషన్ వజ్రప్రహార్” కార్యక్రమంలో భాగంగా కర్నూలు పట్టణంలోని బంగారుపేట ప్రాంతంలో శనివారం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా, ఈగల్ ఐజి ఆకే రవికృష్ణ, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా ఆధ్వర్యంలో కర్నూలు సివిల్ పోలీసులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, ఈగల్ టీం పోలీసులు సంయుక్తంగా డ్రోన్ కెమెరా సహాయంతో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీలలో భాగంగా 350 లీటర్ల బెల్లం ఊటను, 50 లీటర్ల నాటుసారాను గుర్తించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా మాట్లాడుతూ ప్రజలు డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. నేర నియంత్రణతో పాటు రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చే లక్ష్యంతో ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

యువతను ప్రభావితం చేస్తున్న గంజాయి, డ్రగ్స్, నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ “నాశముక్త్ భారత్ అభియాన్” ప్రతిజ్ఞ చేయించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్ 112 లేదా డయల్ 100 లేదా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇటువంటి కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతాయని తెలిపారు. జిల్లా ఎక్సైజ్ అధికారి సుధీర్ బాబు మాట్లాడుతూ నాటుసారా తయారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ కొందరు ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

జీవనోపాధి కోసం ప్రభుత్వం పలు అవకాశాలు కల్పిస్తున్నందున ఇలాంటి అక్రమ మార్గాలను విడిచిపెట్టాలని సూచించారు. కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్ మాట్లాడుతూ నాటుసారా తయారీని పూర్తిగా మానుకోవాలని హెచ్చరించారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి విద్యాబోధనపై దృష్టి పెట్టాలని సూచించారు. మార్పు రాకపోతే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి సుధీర్ బాబు, కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్, ఏఈఎస్ఆర్ రామకృష్ణా రెడ్డి, కర్నూలు పట్టణ సీఐలు నాగరాజారావు, శేషయ్య, చంద్రబాబు నాయుడు, తేజ మూర్తి, పార్థసారథి, మన్సురుద్దీన్, ఎక్సైజ్ సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్, జయరాం నాయుడు, ఈగల్ టీం ఎస్సై సుజన్ కుమార్ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

