చింతపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో వివాదం..

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా చింతపల్లి జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఒక ఉపాధ్యాయుడితో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. సెలవు కోరిన ఉపాధ్యాయుడిని తోటి సిబ్బంది ఎదుట ‘రౌడీలా ప్రవర్తిస్తున్నావు’ అంటూ మాట్లాడిన ఘటన చర్చనీయాంశంగా మారింది.
శనివారం మధ్యాహ్నం, తన సహోద్యోగి రిటైర్మెంట్ సందర్భంగా ఆఫ్‌డే సెలవు కావాలని ఒక ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయురాలికి దరఖాస్తు సమర్పించారు. ఈ సందర్భంగా హెడ్‌మాస్టర్ గదిలో ఇతర ఉపాధ్యాయుల సమక్షంలో ప్రధానోపాధ్యాయురాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘నువ్వు రౌడీలా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీకు సెలవు ఇవ్వను’ అంటూ చెప్పడంతో ఉపాధ్యాయుడు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది.
విద్యార్థులతో పనులు చేయించడంపై ఆరోపణలు
చింతపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో గత కొంతకాలంగా విద్యార్థులతో పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం 8వ తరగతి విద్యార్థులతో పాఠశాల ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న బాత్రూం స్లాబ్‌పై ప్రమాదకర పరిస్థితుల్లో నీళ్లు పోయించిన ఘటనకు సంబంధించిన ఫోటోలను ఒక ఉపాధ్యాయుడు తీసినట్లు సమాచారం. ఈ ఘటనను బయటకు వెల్లడించారని భావించిన ప్రధానోపాధ్యాయురాలు, ఆ ఉపాధ్యాయునితో ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఇదే వివాదానికి కారణమై ఉండొచ్చని పాఠశాల వర్గాలు చెబుతున్నాయి.
డీఈఓకు లిఖిత పూర్వక ఫిర్యాదు
తోటి ఉపాధ్యాయుల ఎదుట అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ, ఉపాధ్యాయుడు జగ్రామ్ శనివారం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) బొల్లారం బిక్షపతికి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. అలాగే చింతపల్లి ఎంఈఓ అంజయ్యకు కూడా తన వినతి పత్రాన్ని అందజేశారు. విధి నిర్వహణలో ఉన్న తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన ప్రధానోపాధ్యాయురాలిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు.
