పేరుకే మున్సిపాలిటీ… అభివృద్ధి ఏది..?

పేరుకే మున్సిపాలిటీ… అభివృద్ధి ఏది..?

కొండగడప లో ‘ఖననం’ కష్టాలు…అంత్యక్రియల అవస్థలు !
స్మశాన వాటిక ఏర్పాటు చేయాలి

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప లో సుమారు 2600 జనాభా ఉంది. ఈ గ్రామంలో 3,4 వార్డులు( ఇద్దరు కౌన్సిలర్లు) ఉన్నారు. 2 వేల పై చిలుకు ఓటర్లు ఉన్నారు. కుగ్రామాల్లో,తండాల్లో సైతం గత ప్రభుత్వాల హయాంలో స్మశాన వాటికలు నిర్మించారు.అంతకుముందు గ్రామపంచాయతీ గా ఉన్న కొండగడప గ్రామాన్ని కాస్త మోత్కూర్ మున్సిపాలిటీ లో విలీనం చేయడంతో , ఆ గ్రామంలో కనీసం స్మశాన వాటిక కు నోచుకోకపోవడంతో.. ఊరి అవతల చెరువు అలుగు కింద ప్రభుత్వ స్థలంలో వర్షాకాలంలో మృతదేహాల ‘ ఖననం’ కష్టతరంగా మారింది. వర్షాకాలంలో చెరువు అలుగు కింద అలుగు నీళ్లు పోతుంటే స్థలం లేక అలుగు బండ ల మీద ఖననం చేయాల్సిన దుస్థితి ఉంది.

మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియల వేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వరద నీటిలో అంత్యక్రియలు చేయడం వారికి నరకాన్ని తలపిస్తోంది. శాస్త్ర ప్రకారం ,తమ కుటుంబాల ఆచారం ప్రకారం కొంతమంది తప్పనిసరిగా ఖననం చేయాల్సిన పరిస్థితి ఉండగా..మరికొంతమంది బొంద పెట్టేందుకు బిక్కేరు వాగు కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అంత్యక్రియలకు వెళ్లే బాటలు సైతం సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ,ఎమ్మెల్యే స్పందించి ఈ ఎండాకాలం లోనే ఊరిలో స్మశాన వాటిక నిర్మాణానికి తక్షణమే నిధులు మంజూరు చేసి,నిర్మాణ పనులు చేపట్టి వచ్చే వర్షాకాలం వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే ఖననం కష్టాలు తొలగించిన వారువుతారని స్థానికులు కోరుతున్నారు. మున్సిపల్ కమిషనర్ వివరణ : కొండగడప లో స్మశాన వాటిక కోసం ఎలాంటి నిధులు మంజూరు కాలేదు.

Leave a Reply