పసుపు రైతులను మోసం చేసే సహించేది లేదు..

వేల్పూర్, ఆంధ్రప్రభ : పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరమని,నిజామాబాద్ మార్కెట్ యార్డ్‌లో పసుపు కొనుగోలు ప్రక్రియలో ఈ-నామ్ లో ఏర్పడిన సాంకేతిక లోపాల వల్ల పసుపు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రకటనలో శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే పాత ఈ-నామ్ విధానంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, సరైన శిక్షణ లేకుండా, సాంకేతిక సదుపాయాలు సిద్ధం చేయకుండా కొత్త ఈ-నామ్ విధానాన్ని అమలు చేయడం వల్ల ఏర్పడిన సాంకేతిక లోపాలతో పసుపు కొనుగోళ్ళ విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
నిజామాబాద్ మార్కెట్ యార్డ్ కి పసుపు పంట గణనీయంగా వచ్చినా, ప్రభుత్వాలు ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేక కొనుగోలు సక్రమంగ చేయడంలో విఫలమయ్యాయి. ఫలితంగా రైతులు ప్రతిసారి పంటను అమ్ముకోవడానికి మూడునాలుగు రోజులు పడిగాపులు కాసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల మార్కెట్ యార్డ్‌లో పసుపు రైతులు తమ పసుపును అమ్ముకోవడానికి రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఉందని అన్నారు.
పారదర్శకత లేకుండా బహిరంగ వేలం ద్వారా పసుపు కొనుగోలు చేయడం ద్వారా రైతులకు నష్టం జరిగి దళారులకు లాభం చేకూర్చడాన్ని ఎమ్మెల్యే తప్పు పట్టారు.మార్కెట్ యార్డ్ కి పసుపు తీసుకొచ్చి మూడు నాలుగు రోజులైనా సరైన ధరకు పంట కొనుగోలు చేయకుండా రైతులను నష్టపరిచే ప్రయత్నం దళారులు చేసే అవకాశం ఉందని అన్నారు.దళారులు సిండికెట్ అయ్యి పసుపు రైతులకు నష్టం కలిగిస్తే సహించేది లేదని,పసుపు రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి అని అన్నారు.
ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, ఈ-నామ్ విధానంలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని, దళారుల ద్వారా పసుపు రైతులు మోసపోకుండా చూడాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.రైతుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడతామని, సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పసుపు రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.
