స్థానిక యువతకే ఉద్యోగాలివ్వాలి

స్థానిక యువతకే ఉద్యోగాలివ్వాలి
ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తి, ఆంధ్రప్రభ : శ్రీకాళహస్తి నియోజకవర్గ యువత భవిష్యత్తు , స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అసెంబ్లీ వేదికగా గళమెత్తారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి, నిరుద్యోగిత, కాలుష్య నియంత్రణపై ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేశారు.
యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చొరవతో శ్రీకాళహస్తి ప్రాంతానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఈ పరిశ్రమల్లో స్థానిక యువతకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మా ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు, మా నియోజకవర్గ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కంపెనీలపై ఉంది అని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని కోరారు.
కాలుష్యంపై ఆందోళన…
పరిశ్రమల స్థాపనతో పాటు పెరుగుతున్న కాలుష్యంపై సుధీర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం కారణంగా స్థానికులు కిడ్నీ వ్యాధులు వంటి తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని సభ దృష్టికి తెచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సీఎస్ఆర్ నిధుల్లో పారదర్శకత…
పరిశ్రమలు ఖర్చు చేసే సామాజిక బాధ్యత నిధుల వినియోగంపై పూర్తి పారదర్శకత ఉండాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ నిధులను ఏయే అభివృద్ధి పనులకు వాడుతున్నారో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. శ్రీకాళహస్తి యువత ఉపాధి, ప్రజా ఆరోగ్యం కోసం అసెంబ్లీలో బొజ్జల సుధీర్ రెడ్డి వినిపించిన స్వరం నియోజకవర్గ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
