ప్రశ్నించినందుకే కేనా..?

జైనూర్ , ఆంధ్రప్రభ ; ప్రశ్నించే స్వరాన్ని అణిచివేయాలనే ప్రయత్నంగా ఆదివాసీ మహిళ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యంపై దాడి అని ఆదివాసీ సంఘాల ఐక్యకార్యచరణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రసిడేంట్,మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కనక యాధవ రావు విమర్శించారు. ఆయన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో మంగళవారం జైనూర్ లో ఆదివాసి నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కనక యాదవరావు మాట్లాడుతూ.. వెంటనే అక్రమ కేసును వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
క్యాతన్‌పల్లిలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఇన్చార్జ్గా వెళ్లిన ఎమ్మెల్యే అన్యాయాలపై ప్రశ్నించారని తెలిపారు. ప్రశ్నిస్తే పోలీసులతో అడ్డగించి, తోపులాట సృష్టించి, చివరకు అదే అంశాన్ని కారణంగా చూపించి కేసు పెట్టించడం రాజకీయ కక్షసాధింపే అని ఆరోపించారు. మంత్రి వివేక్ వెంకట్ స్వామి కుట్రపూరితంగా ఈ వ్యవహారాన్ని నడిపించారని తీవ్ర ఆరోపణలు చేశారు. క్యాతన్‌పల్లి ప్రజలు ఇప్పటికే తమ తీర్పు ఇచ్చారని, బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిప్పికొట్టారని గుర్తుచేశారు.
మంత్రి వివెక్ వెంకట్ స్వామి తన అధికార మదంతో కౌన్సిలర్లపై ఒత్తిళ్లు తెచ్చి కోరం ఏర్పాటు చేయాలని ప్రయత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. పోలీసులను, అధికారులను రాజకీయాలకు వాడుకోవడం ప్రజాస్వామ్యానికి మచ్చ అన్నారు. గత ప్రభుత్వ హయంలో కుమ్రం భీం జిల్లా ఏర్పాటు, జోడేఘాట్‌లో కుమ్రం భీం మ్యూజియం స్థాపన, పూలాజీ బాబా మహోత్సవం, జంగుబాయి జాతర, కేస్లాపూర్ నాగోబా జాతర అభివృద్ధికి, గుస్సాడి దండారి ఉత్సవాలనిధులు తీసుకువచ్చిన నాయకురాలు కోవ లక్ష్మి అని తెలిపారు.
అలాంటి నాయకురాలిని రాజకీయ కుట్రలో భాగంగా టార్గెట్ చేయడం ఆదివాసీ సమాజాన్ని అవమానించడమేనన్నారు. ఆదివాసీలు రాజకీయంగా ఎదగకూడదనే కుట్ర ఇది. మా మహిళా ఎమ్మెల్యేను కించపరచే ప్రతి ప్రయత్నానికి తగిన సమాధానంతప్పక ఇస్తాం. కేసులు ఎత్తివేయకపోతే ఆదివాసీల ఆగ్రహం ఎలా ఉంటుందో చూపిస్తామని స్పష్టం చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టే ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని, రాబోయే ఎన్నికల్లో రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, ఆదివాసీలు పాల్గొన్నారు.
