30 injured| అదుపు తప్పి.. వాగులోకి పల్టీ

అదుపు తప్పి.. వాగులోకి పల్టీ
30 మందికి గాయాలు..!
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం షాంపూర్ గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడ్డ ఘటనలో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఈరోజు ఉదయం ఆదిలాబాద్ బయల్దేరింది. షాంపూర్ వద్దకు చేరుకోగానే.. అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ తో పాటు 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు సహాయక చర్యలు చేపట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. బస్సు అద్దాలు పగులగొట్టి కిటికీల ద్వారా బయటకు తీసుకొచ్చి 108 వాహనాల్లో చికిత్స నిమిత్తం ఉట్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స అందుతుండగా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా డాక్టర్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం కొందరిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం అర్ధరాత్రి వర్షం పడడం, మరోవైపు ఉదయం పూట రహదారిపై పొగ మంచు కమ్ముకోవడంతో డ్రైవర్ ముందు భాగం కనబడక కల్వర్టును ఢీ కొట్టినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్ ను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
