Ex mp | బుట్టా కుటుంబంపై ఆర్థిక ఉక్కుపాదం..

Ex mp | బుట్టా కుటుంబంపై ఆర్థిక ఉక్కుపాదం..

రూ. 782 కోట్ల బకాయిల వసూలుకు ఆస్తుల వేలం దిశగా చర్యలు.
ఎల్ఐసి హౌసింగ్ విభాగం నిర్ణయం

Ex mp | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభః వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ శివ బుట్టాకు ఆర్థిక వ్యవహారాల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తమ వ్యాపార అవసరాల నిమిత్తం బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెరిడియన్ ఎడ్యుటెక్ సంస్థల పేరిట జీవిత బీమా సంస్థకు చెందిన గృహ రుణ విభాగం నుంచి సుమారు రూ. 340 కోట్ల రుణాన్ని పొందిన ఈ దంపతులు, ప్రారంభంలో కొంతకాలం వాయిదాలు సక్రమంగా చెల్లించినప్పటికీ, గత ఐదేళ్లుగా చెల్లింపులు నిలిచిపోవడంతో వడ్డీతో కలిపి మొత్తం బకాయి రూ. 782.07 కోట్లకు పెరిగినట్లు ఆరోపణలున్నాయి.


పలుమార్లు నోటీసులు – ఫలితం లేకపోవడంతో కఠిన చర్యలు


బకాయిల వసూలు కోసం రుణదాత సంస్థ ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ చెల్లింపుల విషయంలో స్పష్టత రాకపోవడంతో ఆస్తుల స్వాధీనం, వేలం ప్రక్రియ వైపు అడుగులు వేసింది. కోవిడ్ ప్రభావంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయని, రుణాన్ని పునర్వ్యవస్థీకరించాలని బుట్టా దంపతులు కోరినప్పటికీ, నిబంధనల ప్రకారం చెల్లింపులు జరగకపోవడంతో ఒప్పందం కుదరలేదని తెలిసింది. ఈ వివాదం జాతీయ కంపెనీ న్యాయ ట్రైబ్యునల్ వరకు చేరడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.


ఖరీదైన ప్రాంతాల్లో ఆస్తులు వేలం జాబితాలో


తాజాగా ప్రకటించిన వేలం ప్రకటనలో హైదరాబాద్ నగరంలోని అత్యంత విలువైన ప్రాంతాల్లో ఉన్న ఆస్తులు చేర్చబడ్డాయి. ముఖ్యంగా కేపీహెచ్బీ ఫేజ్-6లో సుమారు 3,833 చదరపు గజాల స్థలం విక్రయానికి ఉంచబడింది. ప్రస్తుతం అక్కడే మెరిడియన్ స్కూల్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ ఆస్తికి సుమారు రూ. 65 కోట్ల కనీస ధర నిర్ణయించినట్లు సమాచారం. అదనంగా మాదాపూర్, ఖానామెట్ ప్రాంతాల్లోని ఇతర విలువైన స్థలాలు కూడా వేలం జాబితాలో ఉన్నాయి.


కొనుగోలుదారులకు గడువు


ఈ ఆస్తుల కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు మార్చి 23వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని, మార్చి 24న ఆన్లైన్ విధానంలో వేలం నిర్వహించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. ఒకప్పుడు రాజకీయంగా, వ్యాపారపరంగా ప్రభావం కలిగిన బుట్టా కుటుంబం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక సంక్షోభం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.


రాజకీయ ప్రయాణం – వ్యాపార ఒత్తిళ్ల మధ్య


బుట్టా రేణుక 2014లో కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ మార్పు, తిరిగి వైసీపీ గూటికి చేరిక వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ పట్ల విధేయతకు గుర్తింపుగా రాష్ట్ర హ్యాండ్లూమ్ వీవర్స్ సహకార సంఘం చైర్మన్ పదవి దక్కింది. 2024లో ఎమ్మిగనూరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. రాజకీయ ప్రయాణం ఒక వైపు కొనసాగుతుండగా, వ్యాపార రంగంలో పెరిగిన అప్పులు మరోవైపు ఒత్తిడి సృష్టిస్తున్నాయి. ఆస్తుల వేలం ప్రక్రియ ద్వారా బకాయిల వసూలు ఎంతవరకు సాధ్యమవుతుందో, బుట్టా కుటుంబం ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Leave a Reply