ApCMAngry | అది బూతుల పార్టీ Andhra Prabha News

ApCMAngry | అది బూతుల పార్టీ Andhra Prabha News
ApCMAngry | తిరుమల లడ్డూ వివాదంపై సీఎం ఆగ్రహం
వైసీపీకి పరోక్ష హెచ్చరిక
సూపర్ సిక్స్ సూపర్ హిట్
శ్రీవారి ప్రతిష్ట దెబ్బతీశారు
రాజకీయ ప్రక్షాళన తప్పదు
చెత్త నిర్వహణలో విప్లవాత్మక మార్పులు
చెత్త నుంచి సంపద సృష్టి లక్ష్యం
జపాన్ తరహా పరిశుభ్రత అలవాట్లు అవసరం
వినుకొండలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర ప్రారంభం
Ap CM Angry | ఆంధ్రప్రభ, పల్నాడు బ్యూరో: శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి తిరుమలను అపవిత్రం చేసిన వ్యక్తులు తిరిగి ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దొంగే దొంగా దొంగా అనే పరిస్థితి వచ్చింది. దీనిని అడ్డుకుని తీరతాం, అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పరోక్షంగా వైపీపీ అధినేతకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండలో స్వచ్ఛాంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఘన వ్యర్ధాల సేకరణ కోసం నిర్దేశించిన స్వచ్ఛ రథాన్ని సీఎం ప్రారంభించారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటా చెత్త సేకరణ కోసం ఉద్దేశించిన పుష్ కార్ట్ లు, ఈ ఆటోస్ ను ప్రారంభించారు. వ్యర్ధాల సేకరణకు అనుసరించాల్సిన విధానాలను సీఎం దిశానిర్దేశం చేశారు. మార్చి నాటికల్లా గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం డోర్ టు డోర్ కలెక్షన్ చేపట్టాలని ఆదేశించారు. పల్నాడు జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్భించారు. స్వయం సహాయ సంఘాలతో చేపట్టిన చిల్లీ, మెయిజ్ ప్రాసెసింగ్ ప్లాంట్, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ తదితర స్టాళ్లను సీఎం పరిశీలించారు.

561 స్వయం సహాయ సంఘాలకు 100.14 కోట్ల చెక్కును సీఎం చంద్రబాబు అందజేశారు. మొక్కజొన్న వేస్ట్‌తో తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించి ఉత్పత్తి వ్యయం తగ్గించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నాం. పచ్చదనం, పరిశుభ్రం, నీరు-మీరు, ఆకస్మిక తనిఖీలతో ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలు నిర్వహించాం. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్టే వీధులను, రోడ్లను కూడా పరిశుభ్రంగా ఉంచే బాధ్యత మనం అంతా తీసుకుందాం అన్నారు.
Ap CM Angry : సూపర్ సిక్ప్ .. సూపర్ హిట్ చేశాం

ఈ సందర్భంగా వినుకొండలో ఏర్పాటు చేసిన ప్రజావేదికపై ఆయన ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించాం . మొదటి తారీఖునే పేదల సేవలో పేరిట ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో స్వయంగా నేనే పాల్గొంటున్నాను . దేశంలో ఏ రాష్ట్రమూ ఏపీకి దరిదాపుల్లో లేనంత సంక్షేమాన్ని అందిస్తున్నాం. తల్లికి వందనం ద్వారా ఎంత మంది పిల్లలు ఉన్నా ఆర్ధిక సాయం అందించాం. అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20 వేల ఆర్ధిక సాయం 3 విడతల్లో అందిస్తున్నాం. రైతులు పండించే పంటలకు మార్కెట్ ధర అందాలి,

సాగునీరు అందుబాటులో ఉండాలి. ఉత్పత్తుల మార్కెట్ అంచనాలను తెలిసేలా టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నాం . ఇటీవల బిల్ గేట్స్ కూడా వచ్చి రైతులు టెక్నాలజీ వినియోగిస్తున్న తీరును చూసి ఎంతో ఆనందించారు. వినుకొండను కూడా హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ఆలోచన చేస్తాం. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాం. అని సీఎం చంద్రబాబు నాయడు వివరించారు. …
Ap CM Angry : నమ్మకం పోగొట్టారు

గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్ధిక విధ్వంసం చేశారు. పరిశ్రమల్ని తరిమేశారు. ఆంధ్రప్రదేశ్ కు ఉన్న నమ్మకాన్ని పోగొట్టారు. ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలు, భవిష్యత్ ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీ పునర్నిర్మాణం మొదలు పెట్టాం. 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చాం. టీచర్లు, పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాలు ఇచ్చాం . రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండేలా వేగంగా పనులు చేశాం. కొత్త రోడ్లను కూడా నిర్మిస్తున్నాం, అని సీఎం చంద్రబాబు నాయుడు తమ పాలన తీరును బేరీజు వేశారు.
Ap CM Angry : ఆంబోతుల రెచ్చగొడుతున్నారు

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బూతులు తిట్టే పార్టీ రాష్ట్రంలో ఉంది. ఆంబోతుల తరహాలో తయారై రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. గంజాయి రవాణా చేశారు. మదనపల్లెలో గంజాయి సేవించి మానవ మృగంగా ప్రవర్తించాడు. ఆడబిడ్డల జోలికి వస్తే అది వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించాను. చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది. ఆ భయంతో ఆ మృగాడు ప్రాణాలు తీసుకున్నాడు, అని సీఎం అన్నారు. వివేకా హత్య ఘటనలో నాటకాల రాయుడు రోజుకు ఓ వేషం వేశాడు. చిన్నాన్న కుమార్తె కూడా మోసపోయేంతగా నాటకాలు వేశారు. లడ్డూ ప్రసాదం అపవిత్రం చేశారని చెబితే అవినీతి జరిగిందని చెబుతుంటే తిరిగి హెరిటేజ్‌పై ఆరోపణలు చేస్తున్నారని, దొంగే దొంగా దొంగా అనే స్థితి ఏర్పడిందని, తాము ఈ స్థితిని అడ్డుకుంటామని సీఎం స్పష్టం చేశారు.
Ap CM Angry : శ్రీవారి ప్రతిష్టను దిగజార్చారు

శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజార్చేలా కొందరు ప్రవర్తిస్తున్నారు. గత పాలకులు శ్రీవారి ప్రసాదాన్ని కూడా నాసిరకంగా తయారు చేయించారు. ఆ పవిత్రతను దెబ్బతీసే అధికారం ఎవ్వరికీ లేదు. అలాంటి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. వారు సరఫరా చేసిన కల్తీ నెయ్యిని పరీక్ష చేయించాం. జంతువుల కొవ్వు ఉందని ల్యాబ్ నివేదిక వచ్చింది. దీనిపై ఏర్పాటైన సిట్ విచారణ చేసి అది అసలు నెయ్యే కాదని చెప్పింది. వాళ్లు చేసిన తప్పును ఇతరుల పై నెట్టి వేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ap CM Angry : మండలిలోనూ అదే తంతు

సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వర స్వామి ఫోటోను కూడా శాసన మండలిలోకి తీసుకువెళ్లి రాజకీయం చేశారు. చెప్పులు వేసుకుని, వేంకటేశ్వరస్వామి ఫోటోను విసిరివేస్తారా.? ఎందుకు వాళ్లకింత అహంకారం? రాష్ట్రంలో కొదరు చెత్త రాజకీయాలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారు . పరామర్శలని చెప్పి వెళ్లి వాళ్ల కార్ల కింద మనుషుల్ని చంపేస్తారు . బూతులు తిట్టిన వాళ్లను, రౌడీయిజం చేసిన వాళ్లను పరామర్శించే వ్యక్తులు..వాళ్ల కారు కింద పడిన వారిని మాత్రం పరామర్శించరు, అని వైసీపీ నేతలను సీఎం ఎద్దెవ చేశారు.
Ap CM Angry : రాజకీయ ప్రక్షాళన తప్పదు
.

రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత నా ఒక్కడిదే కాదు ప్రజలందరిదీ కూడా చెడును నిరాకరించే పరిస్థితి ప్రజల్లోనూ రావాలి. అప్పుడే రాజకీయ ప్రక్షాళన జరుగుతుంది. ఎన్నికల ముందు ఉన్నపళంగా నన్ను అరెస్టు చేస్తున్నామని చెప్పి జైల్లో వేశారు. కేవలం ప్రజల కోసమే, రాష్ట్రం కోసమే ఇప్పటికీ పోరాటం చేస్తున్నాను. జైల్లో నుంచి తిరిగి రారని చాలా మంది నాకు చెప్పారు. నేను ఏనాడు భయపడలేదు.అని సీఎం చంద్రబాబు వివరించారు.
Ap CM Angry : చెత్తను గుట్టలుగా పేర్చారు
గత పాలకులు వదిలేసిన 108 లక్షల టన్నుల చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. భూమి, భూగర్భజలాలు, వాతావరణం కలుషితం అయిపోయి రోగాల బారిన పడే పరిస్థితి వచ్చేసింది. మలేరియా, డెంగ్యూ, డయేరియా లాంటి సంక్రమిత వ్యాధులు తడి వ్యర్ధాల కారణంగానే వస్తున్నాయి. అందుకే ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ మొత్తం చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టాం మున్సిపాలిటీల్లో 97 శాతం మేర ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్నాం.

గ్రామీణ ప్రాంతాల్లో మార్చి నాటికల్లా వంద శాతం మేర డోర్ టు డోర్ కలెక్ట్ చేస్తాం . ఇంటి వద్ద వచ్చే చెత్తను కాంపోస్టు ఎరువుగా మార్చుకుని ఇంటిపైన పెట్టుకున్నమొక్కలకు ఎరువు ఇచ్చేలా చూడాలి. రాష్ట్రంలో 4,14,014 కుటుంబాలు హోం కాంపోస్టు తయారు చేసుకుని టెర్రస్ గార్డెన్‌కు వినియోగిస్తున్నారు . ఘన వ్యర్ధాలను ప్రాసెస్ చేసి చెత్త నుంచి సంపద సృష్టించటం, విద్యుత్ ఉత్పత్తి లాంటివి చేస్తున్నాం చెత్త సేకరణ కోసం ట్రై సైకిళ్లు, ఈ- ఆటోలు, వివిధ యంత్రాలను కూడా వినియోగిస్తున్నాం, సీఎం వివరించారు.
Ap CM Angry : జపాన్ తరహాలో అలవాట్లు మార్చుకుందాం
విశాఖ, గుంటూరులలో చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు ఉన్నాయి రాజమండ్రి సహా మరో 5 ప్లాంట్లు త్వరలోనే ఏర్పాటు చేసి చెత్త నుంచి విద్యుత్ తయారు చేసేలా ప్రయత్నాలు చేస్తున్నాం. తడి, పొడి చెత్తలను సరిగ్గా నిర్వహించేలా ప్రయత్నాలను ప్రభుత్వం చేస్తోంది.

రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని బ్యాన్ చేశాం. ఈ ప్లాస్టిక్ వల్ల పశువులు, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. స్వచ్ఛభారత్ కార్యక్రమం ద్వారా పరిశుభ్రతలో మెరుగ్గా ఉన్న వారికి అవార్డులు ఇస్తున్నారు. చెత్త, వ్యర్ధాల నిర్వహణలో మన ఆలోచనా తీరు మారాలని ఆకాంక్షిస్తున్నాను. . జపాన్ పౌరుల తరహాలో చెత్త విషయంలో మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సి ఉంది. అని సీఎం సూచించారు. కార్యక్రమంలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్, కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు.














