ప్ర‌భుత్వం విఫ‌లం.. త‌ల‌సాని

ప్ర‌భుత్వం విఫ‌లం.. త‌ల‌సాని

హైదరాబాద్, ఆంధ్రప్రభ : నగరంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మైత్రివనం వద్ద గల నీలగిరి బ్లాక్ లో షార్ట్ సర్క్యూట్ ప్రమాదం జరిగిందని తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం వివరాల గురించి ఫైర్, పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు సకాలంలో స్పందించడం వలన ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.

నిత్యం ఎంతో బిజీగా ఉండే నీలగిరి బ్లాక్ లో ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని భవనంలో ఉన్నవారు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారని స్థానికులు ఎమ్మెల్యే కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నగరం పరిధిలో ప్రమాదాలు జరిగినప్పుడే ప్రభుత్వం హడావుడి చేస్తుంది తప్ప… ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా నిర్దిష్టమైన కార్యాచరణ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భవన నిర్వాహకులకు అవగాహన కల్పించాలన్నారు.

చార్మినార్ వద్ద గల గుల్జార్ హౌస్ లో ప్రమాదంలో సుమారు10మంది వరకు మరణించారని గుర్తు చేశారు. సంగారెడ్డి లోని సిగాచిలో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, బాబా, వేణు గౌడ్, వినోద్ తదితరులు ఉన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు జరిపి అప్రమత్తం చేశామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.

Leave a Reply