Mlc | అంతా బూటకం.. అప్పుల్లో రాష్ట్రం

Mlc | అంతా బూటకం.. అప్పుల్లో రాష్ట్రం

అప్పులపై చంద్రబాబు సర్కార్ అబద్ధాలు బట్టబయలు..
శాసనమండలిలో ఆర్థిక శాఖ మంత్రి ప్రకటనలకు పొంతనలేదు
బడ్జెట్‌లో కార్పొరేషన్ అప్పుల దాచివేత
ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం
ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

Mlc | నందిగామ, ఆంధ్రప్రభః కుటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అప్పుల పై చంద్రబాబు సర్కారు అబద్ధాలు బయటపడ్డాయని ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మీడియా పాయింట్ వద్ద డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ అప్పుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి అబద్ధాలను బయటపెట్టిందని తీవ్ర విమర్శలు చేశారు.

ఆర్థిక శాఖ మంత్రి శాసనసభలో ఒక విధమైన ప్రకటన చేయగా, శాసనమండలిలో మరో విధమైన ప్రకటన చేస్తూ పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. బడ్జెట్‌లో రంగాల వారీగా ఆదాయ వివరాల విషయంలో ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోందని, అప్పులపై వాస్తవాలను ప్రజల నుంచి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం గ్యారెంటీతో తీసుకున్న కార్పొరేషన్ అప్పులను బడ్జెట్ సంక్షిప్త నివేదికలో చూపకుండా దాచేసిందని అన్నారు. ఇలా అసంపూర్తి లెక్కలతో బడ్జెట్ సంక్షిప్త నివేదిక ఇవ్వడం చంద్రబాబు ప్రభుత్వానికి ఇది రెండోసారి అని గుర్తు చేశారు.

గత బడ్జెట్‌లోనూ ఐదేళ్ల అప్పుల వివరాలను పూర్తిగా వెల్లడించకుండా తప్పించుకున్నారని తెలిపారు. వైయస్ జగన్ హయాంలో బడ్జెట్ అప్పులు కేవలం రూ.2,34,225 కోట్లే కాగా, కార్పొరేషన్ అప్పులు పదేళ్లలో రూ.1,40,479 కోట్లుగా ఉన్నాయని అధికారికంగా ప్రకటించారని చెప్పారు. అయినప్పటికీ వైయస్ జగన్ పాలనలో రూ.14 లక్షల కోట్ల అప్పులంటూ చంద్రబాబు అండ్ కో అబద్ధపు ప్రచారం చేశారని ఆరోపించారు.

మొత్తం ఆంధ్రప్రదేశ్ అప్పులు 2024 వరకు రూ.4,91,734 కోట్లుగా ప్రకటించారని, అదే కాలానికి కార్పొరేషన్‌ల ద్వారా తీసుకున్న అప్పులు రూ.1,40,479 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. అయితే 2024 తర్వాత తీసుకున్న కార్పొరేషన్ అప్పుల వివరాలను ప్రభుత్వం ఇప్పటివరకు వెల్లడించలేదని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను పచ్చిగా మోసం చేస్తూ విష ప్రచారాలతో కాలం వెల్లదీస్తోందని, కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్న విషయం మరోసారి తేటతెల్లమైందని స్పష్టం చేశారు.

Leave a Reply