Marketing | స్వయం ఉపాధితోనే మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం

Marketing | స్వయం ఉపాధితోనే మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం
- ఎంపీ కేశినేని శివనాథ్
- ఎన్.ఐ.ఆర్.డి లో 7 విభాగాల్లో శిక్షణ పొందిన మహిళలతో ఎంపీ కేశినేని శివనాథ్ సమావేశం
Marketing | విజయవాడ, ఆంధ్రప్రభ : స్వయం ఉపాధి కోసం కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డిలో నైపుణ్యాభివృద్ది శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధితో పారిశ్రామిక వేత్తలుగా మారి ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అలాగే మార్కెటింగ్ పరంగా కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
విజయవాడ గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఎంపీ కేశినేని శివనాథ్ మిల్లెట్స్, గార్మెంట్స్ అండ్ లెదర్, నాచురల్ ఫార్మింగ్ , తేనె తయారీ, జ్యూట్ అండ్ కాటన్ బ్యాగ్స్ హెర్బల్ ప్రొడక్ట్స్ తయారీ పై శిక్షణ పొందిన ఏడు గ్రూపుల మహిళలతో గ్రూపుల వారీ గా విడివిడిగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా పిడి డి.ఆర్.డి.ఎ నాంచారయ్య కూడా పాల్గొన్నారు. మహిళలు తాము తయారు చేసిన వస్తువులను ఎంపీ కేశినేని శివనాథ్ కి చూపించారు. ఆ వస్తువుల నాణ్యత, భద్రత ల కోసం తీసుకున్న జాగ్రత్తల గురించి ఎంపీ కేశినేని శివనాథ్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా శిక్షణ పొందిన మహిళలు తమకి రా మెటీరియల్ కొనుగోలు విషయంలో, మార్కెటింగ్ పరంగా, అధిక సంఖ్యలో వస్తువుల ఉత్పత్తికి తయారీ కోసం మెషినరీ పరంగా సహకారం అందించాలని ఎంపీ కేశినేని శివనాథ్ ను కోరారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ శిక్షణ పొంది వస్తువులు తయారు చేస్తున్న మహిళలకు మరింతగా ప్రోత్సహకం అందించే విధంగా తాము చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. . ఒకే రకమైన వస్తువులు తయారు చేసే వారందరికీ ఉపయోగపడే విధంగా కామన్ పెసిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ను ఏర్పాటు చేయటానికి వేగవంతంగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అలాగే తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ కల్పించే విధంగా..వారు ఆర్థికంగా మరింత ఉన్నత స్థానంలో వుండే విధంగా కావాల్సిన సహాయ సహకారాలు అందించటానికైనా ముందు వుంటామని తెలిపారు. ఇంటి ఒక ఎంటర్ ప్రెన్యూర్ వుండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాన్ని స్పూర్తిగా తీసుకుని మహిళలను ఎంటర్ ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దేందుకు కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎన్.ఐ.ఆర్.డి లో పలు విభాగాల్లో శిక్షణ ఇప్పించటం జరిగిందన్నారు.

అనంతరం ఎన్టీఆర్ జిల్లా పిడి డి.ఆర్.డి.ఎ నాంచారయ్య మాట్లాడుతూ మిల్లెట్స్, గార్మెంట్స్ అండ్ లెదర్, నాచురల్ ఫార్మింగ్ , తేనె తయారీ, జ్యూట్ అండ్ కాటన్ బ్యాగ్స్ హెర్బల్ ప్రొడక్ట్స్ గ్రూపులకు నాణ్యమైన రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందనే అంశాలపై అవగాహన కల్పించారు. . అలాగే వస్తువుల తయారీ చేసే క్రమంలో, వాటిని మార్కెటింగ్ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ అందించే సహాయంతో పారిశ్రామిక వేత్తలుగా రాణించాలని ఆకాంక్షించారు.
