Rs.13.81 cr | ఎక్కడా తలెత్తరాదు

Rs.13.81 cr | ఎక్కడా తలెత్తరాదు
- జిల్లా కలెక్టర్ అన్సారియా
Rs.13.81 cr | గుంటూరు, ఆంధ్రప్రభ : జిల్లాలో ఎక్కడా వేసవి నీటి ఎద్దడి తలెత్తరాదని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. జిల్లా నీరు, పారిశుధ్య కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లడుతూ వేసవి నీటి ఎద్దడి లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ వారీగా నిధుల లభ్యత నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
గత ఏడాది అంతకంటే ముందు సంవత్సరాలలో జిల్లాలో ఏ మండలాలు, గ్రామాల్లో తాగు నీటి సమస్య వచ్చిందో పరిశీలించి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని గమనించాలని అన్నారు. తాగు నీటి ఎద్దడి గ్రామాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బోరు బావులు మరమ్మతులు 24 గంటల్లో పూర్తి చేయుటకు అవసరమైన విడి భాగాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. తాడికొండ, మేడికొండూరు తదితర మండలాల నుండి తాగు నీటిపై తరచూ పిర్యాదులు అందుతున్నాయని వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వేసవిలో తాగు నీటి సమస్యపై పిర్యాదులు స్వీకరించుటకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఫోన్ ద్వారా సమాచారం అందిన వెంటనే పరిష్కారం చేయాలని అన్నారు. జిల్లాలో మంజూరైన వ్యక్తిగత మరుగుదొడ్లు, సామాజిక మరుగుదొడ్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మంజురైన తాగు నీటి సౌకర్యాలను కూడా పూర్తి చేయాలని చెప్పారు. 85 అంగన్వాడీలలో ఇంకా పనులు ప్రారంభం కాకపోవడం పట్ల ప్రశ్నించారు.
గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్లు, సామాజిక మరుగుదొడ్లు మార్చి నాటికి పూర్తి చేయుటకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 155 గ్రామాల్లో ఓ.డి.ఎఫ్ ప్లస్ పనులు పూర్తి చేశామన్నారు. జిల్లాలో 113 స్లో సాండ్ ఫిల్టర్ ల మరమ్మతులకు రూ.13.81 కోట్లు అవసరమని చెప్పారు. 34 స్లో సాండ్ ఫిల్టర్ పనులను రూ.2.67 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించామని అందులో 26 పూర్తి అయ్యాయని తెలిపారు. వేసవి తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలలో భాగంగా 47 శాతం గ్రామాల్లో సర్వే పూర్తి చేశామన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి జి.శ్రీనివాస్, భూగర్భ జలవనరులు శాఖ ఉప సంచాలకులు వి.వందనం తదితరులు పాల్గొన్నారు.
