హర హర మహాదేవ… శంభో శంకర

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; హర హర మహాదేవ… శంభో శంకర అంటూ భక్తుల శివనామ స్మరణతో మండలంలోని శైవక్షేత్రాలు మారుమోగాయి.మహా శివరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి.దక్షిణ కాశీగా పేరుగాంచిన ఉప్లూర్ లోని శ్రీ బాల రాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాగరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తులు బాల రాజేశ్వరుడిని దర్శించుకున్నారు. ఉదయం నుండే ఆలయం వద్ద పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. ఇతర ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. గతంలో కోరుకున్న మొక్కులు తీరిన పలువురు భక్తులు కోడె దుడలతో మొక్కులు సమర్పించుకున్నారు.

పుట్టు వెంట్రుకలు, బెల్లంతో తులాభారం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉపవాస దీక్షలతో అర్ధరాత్రి స్వామి వారికి జరిగిన మహా రుద్రాభిషేకంలో, స్వామివారి శావా ఊరేగింపులో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఆలయంలోనే శివరాత్రి జాగరణ చేశారు. భక్తులు సోమవారం ఉదయం మరోమారు బాల రాజేశ్వరుడిని దర్శించుకుంటారు. అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్న వితరణ కార్యక్రమంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించి, ఉపవాస దీక్షలను విరమించి స్వస్థలాలకు వెళ్తారు.

మహాశివరాత్రి జాతర సందర్భంగా స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు యాల్ల గణపతి తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా సుమారు 80 వేలకు పైగా మంది భక్తులు జాతర ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నట్లు తెలిపారు.ఉప్లూర్ శ్రీ బాల రాజేశ్వర స్వామి జాతర సందర్భంగా పోలీసు బందోబస్తును కమ్మర్ పల్లి ఎస్సై అనిల్ రెడ్డి పటిష్టంగా ఏర్పాటు చేశారు.జాతరలో వెలసిన దుకాణాల్లో భక్తుల కొనుగోళ్లు జోరుగా సాగాయి.అదేవిధంగా మండలంలోని చౌట్ పల్లి శ్రీ పార్తివ కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. మండల కేంద్రంలోని గొల్లపేట శివాలయంలో, శ్రీగిరి క్షేత్రం పైనున్న శివాలయంలో, అమీర్ నగర్ లోని శివగుట్ట ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కమ్మర్ పల్లి, అమీర్ నగర్ గ్రామాల్లోని శివాలయాల్లో సోమవారం ఉదయం అన్న వితరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న వితరణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

Leave a Reply