School | మురికి కూపంలో అక్షర దేవాలయం..

School | మురికి కూపంలో అక్షర దేవాలయం..

అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం మురికి కాలువ
విద్యార్థుల ఆరోగ్యానికి పొంచి ఉన్న గండం
ప్రజా ప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం

School | ఏర్గట్ల, ఆంధ్రప్రభః పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. కానీ ఇక్కడ పాఠశాల ముందే ఉన్న మురికి కాలువ విద్యార్థుల ప్రాణాలకే ముప్పుగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ద్వారం ముందే ఉన్న మురికి కాలువ పూర్తిగా అద్వానంగా మారింది. వ్యర్థాలు పేరుకుపోవడంతో నీరు దిగువకు వెళ్లే మార్గం లేక అక్కడే నిలిచిపోతోంది. దీనివల్ల వెలువడుతున్న తీవ్రమైన దుర్వాసనతో విద్యార్థులు తరగతి గదుల్లో కూర్చోలేకపోతున్నారు.చాలా కాలంగా పూడిక తీయకపోవడంతో ఈ కాలువ దోమల ఉత్పత్తి కేంద్రంగా మారింది. నిలిచి ఉన్న మురుగు నీటి వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

వందలాది మంది విద్యార్థులు చదువుకునే ఈ విద్యాసంస్థ పరిసరాలు ఇంత అపరిశుభ్రంగా ఉండటం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, తక్షణమే కాలువలను శుభ్రం చేయించి, బ్లీచింగ్ చల్లించాలని కోరుతున్నారు. లేనిపక్షంలో విద్యార్థుల ఆరోగ్యానికి ఏదైనా హాని జరిగితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Leave a Reply