Revanth Reddy | రాముడు పేరు చెబుతారు…

Revanth Reddy | రాముడు పేరు చెబుతారు…
- పొద్దున లేస్తే తలచేది అసద్ నే…
Revanth Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీజేపీ వాళ్ల దేవుడు అసదుద్దీన్ ఓవైసీ అని, రాముడు పేరు చెబుతారు.. పొద్దున లేస్తే తలచేడి అసద్ నే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఎంఐఎంను భూతంగా చూపి ఎంతకాలం ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వాలు ఏం చేయలేదని, రెండేళ్లలోనే కాంగ్రెస్ సర్కార్ ఎన్నో హామీలు నెరవేర్చిందని చెప్పారు. ఓటు వేసే ముందు ఓటర్లు ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం వలన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు.
బీఆర్ఎస్ వాళ్లు బరితెగించి మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ – బీఆర్ఎస్ వాళ్లు కలిసి రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు. రైతు నల్లచట్టాలకు బీఆర్ఎస్ రాజ్యసభలో ఓటు వేసిందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీకి బీఆర్ఎస్ మద్దతు తెలపలేదా…? అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ది విడదీయరాని అనుబంధమన్నారు. మోడీ ప్రేమలో అమరత్వం పొందుతా అన్నట్లు కేసీఆర్ మాట్లాడలేదా ..? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
