coach gambhir|ఢిల్లీలో టీమిండియా..

coach gambhir|ఢిల్లీలో టీమిండియా..

  • హెచ్‌కోచ్ ఇంట్లో ఆట‌గాళ్ల‌కు ప్ర‌త్యేక విందు
  • ఫిబ్రవరి 12న న‌మీబియాతో భార‌త్ ఢీ
  • ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్‌
  • కోలుకున్న బుమ్రా జ‌ట్టులోకి ఎంట్రీ

coach gambhir | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : టీమిండియా ఆటగాళ్లకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన ఇంట్లో దావత్ ఇచ్చాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026‌లో శుభారంభం చేసిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో గురువారం నమీబియాతో ఢిల్లీ వేదికగా తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీకి చేరిన టీమిండియాకు ఆదివారం రాత్రి గంభీర్ తన నివాసంలో ప్రత్యేక విందు ఇచ్చాడు. టీమిండియా ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్ కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్‌తో పాటు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

న‌మీబియాతో టీమిండియా ఢీ
టీ20 వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. తన తొలి మ్యాచ్‌లో అమెరికాపై విజయం సాధించి శుభారంభం చేసింది. అదే ఉత్సాహంతో రెండో మ్యాచ్‌లో ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో తలపడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. వైరల్ ఫీవర్ కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. నమీబియాతో మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులోకి రావడం టీమిండియా బౌలింగ్ విభాగానికి కొండంత బలాన్ని ఇస్తుంది. అయితే బుమ్రా జట్టులోకి వస్తే పేస్ విభాగంలో ఒకరిని తప్పించక తప్పదు. గత మ్యాచ్‌లో 3 వికెట్లతో మెరిసిన మహ్మద్ సిరాజ్‌ను పక్కన పెడతారా లేదా లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ చూపే అర్ష్‌దీప్ సింగ్‌ను బెంచ్‌కు పరిమితం చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో సిరాజ్‌పై వేటు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

ఢిల్లీలో స్పిన్ పిచ్‌
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ప్రస్తుతం జట్టులో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నప్పటికీ.. అవసరమైతే కుల్దీప్ యాదవ్‌ను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే, బ్యాటింగ్ బలాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో రింకూ సింగ్‌ను కొనసాగిస్తే.. కుల్దీప్ మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. మరోవైపు గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ కూడా జట్టుతో కలిసే అవకాశం ఉండటం మేనేజ్మెంట్‌కు తీపి కష్టాలను తెచ్చిపెడుతోంది.

Leave a Reply