11వ వార్డులో కాంగ్రెస్ ‘హస్తం’జోరు..

11వ వార్డులో కాంగ్రెస్ ‘హస్తం’జోరు..
- వోడ్నల శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం
మంథని, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం పతాక స్థాయికి చేరిన వేళ 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వోడ్నల శ్రీనివాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. శనివారం ఆయన తన అనుచరులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి వార్డులోని ప్రతి గడపను పలకరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా ఆయనకు స్థానిక ప్రజలు, మహిళలు ఘనస్వాగతం పలికారు. అభివృద్ధే ఏకైక అజెండా ప్రచారంలో భాగంగా వోడ్నల శ్రీనివాస్ మాట్లాడుతూ.. వార్డులో ఉన్న డ్రైనేజీ, తాగునీరు, మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో వార్డుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించి, 11వ వార్డును అభివృద్ధి పథంలో నిలుపుతానని హామీ ఇచ్చారు. వినూత్నంగా ప్రచారం చేస్తూ కష్టజీవుల కష్టం తెలిసిన వాడిని, ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. ఆత్మీయంగా దుకాణదారులందరినీ పలకరించుకుంటూ ముందుకెళ్తున్నారు. 11వ వార్డులో ఎక్కడ చూసినా కూడా ఓడ్నాల శ్రీనివాస్ గెలుపు ఖాయమని పలువురు చర్చించుకుంటున్నారు.
