Makthal | మార్కెట్ యార్డులో చెట్టు నరికివేత…

Makthal | మార్కెట్ యార్డులో చెట్టు నరికివేత…

  • పట్టించుకోని అధికారులు

Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : వృక్షో రక్షతి రక్షితః చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి అంటూ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆర్భాటంగా మొక్కలు నాటుతుండగా కొంతమంది అక్రమార్కులు ఉన్న చెట్లను నరికి వేసి పర్యావరణన్ని మంటగల్పుతున్నారు. ఇలాంటి సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని మార్కెట్ యార్డులో చోటుచేసుకుంది. మక్తల్ మార్కెట్ యార్డులో దాదాపు 30 సంవత్సరాలుగా పెరిగిన వేప చెట్టును ఒక వ్యక్తి నిర్ధాక్షిణ్యంగా సగం వరకు నరికి వేసిన సంఘటన ఈ రోజు చోటు చేసుకుంది. చెట్టును నరికి వేస్తున్న సమయంలో కొంతమంది అటుగా వెళుతున్న వ్యక్తులు అభ్యంతరం చెప్పడంతో సదరు అక్రమ దారుడు సగం వరకు నరికి వదిలివేశాడు. లేదంటే చెట్టును పూర్తిగా నరికే వాడని చెప్పవచ్చు. చెట్లను పెంచండి అని ప్రభుత్వాలు మొత్తుకుంటుంటే కొంతమంది దుర్మార్గులు ఇలా చెట్లను అడ్డంగా నరికి వేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.

Makthal

మార్కెట్ యార్డులో ఓ వ్యక్తి అక్రమంగా 12 ఫీట్లు స్థలాన్ని ఆక్రమించి మూడంతస్తుల భవనం నిర్మించినప్పటికీ మార్కెట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సదరు వ్యక్తి అధికారులంటే చట్టం అంటే భయం భక్తి లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణం చేపట్టినప్పటికీ మున్సిపల్ అధికారులు సైతంతో ఆ అక్రమ నిర్మాణం పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అప్పట్లో మార్కెట్ అధికారులు మున్సిపల్ అధికారులపై తీరమైన ఆరోపణలు వచ్చాయి. అక్రమ నిర్మాణం చేపట్టిన వ్యక్తి నుండి పెద్ద మొత్తంలో ముడుపులు దండుకొని అక్రమ నిర్మాణానికి ఇటు మార్కెట్ అధికారులు అటు మున్సిపల్ అధికారులు సహకరించారన్న ఆరోపణలు బలంగా వినపడ్డాయి. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో యధేచ్చగా అక్రమ నిర్మాణం పూర్తి చేశారు. నేడు అదే వ్యక్తి చెట్టును సైతం నరికి వేయడం విశేషం.ఇంత జరుగుతున్న అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం శోచనీయం. మంగళవారం మార్కెట్ యార్డ్ కు సెలవు కావడంతో అక్రమదారుడు ఎవరు లేని సమయం చూసి చెట్టును సగం వరకు నరికి వేయడం జరిగింది. ఈ సంఘటనపై పర్యావరణ ప్రేక్షకులు మార్కెట్లో పనిచేసే సమాలీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా భవనం నిర్మించడమే కాకుండా చెట్టును నరికి వేసిన వ్యక్తి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

నీడ లేకుండా చేస్తున్నారు……
నిందితులపై చర్యలు తీసుకోవాలి.. వెంకట్ రెడ్డి హమాలి……

మార్కెట్ యార్డ్ లో కష్టం చేసి కొంతసేపు చెట్టు నీడన సేద తీరుదామంటే కొంతమంది అక్రమార్కులు ఉన్న చెట్లను నరికి వేస్తున్నారని దీంతో నిలువ నీడ లేకుండా పోతుందని హమాలి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చెట్లను నరికి వేయడం మహా పాపం అన్నారు. తాము పనిచేసి అలసిపోయిన సమయంలో 30 ఏళ్లుగా ఆ చెట్టు కింద కూర్చునే వారమని చెట్టును నరికి వేయడంతో నీడ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చెట్టును నరికి వేసిన వ్యక్తి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply