2026 minicipolls | భవిష్యత్ రాజకీయ అడుగులా?

2026 minicipolls | భవిష్యత్ రాజకీయ అడుగులా?
2026 minicipolls | కేడర్ సిద్ధంగా లేకపోవడమే నిర్ణయానికి కారణమా?
పట్టణ రాజకీయాల్లో గెలుపు అంచనాలు ఎలా ఉన్నాయి?
సానుభూతి పవనాలు ఎందుకు పని చేయవని భావిస్తున్నారు?
కవిత లక్ష్యం మున్సిపల్ ఎన్నికలా? అసెంబ్లీ ఎన్నికలా?
భవిష్యత్‌లో కవిత రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతోంది?
పార్టీలోకి కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలేమిటి?
2026 minicipolls | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత పేరు కేవలం. ఆమె ఒక నాయకురాలిగా మాత్రమే కాక, భవిష్యత్ నాయకత్వానికి ప్రతీకగా కూడా స్పష్టాస్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో కవిత సోదరుడితో, హరీష్ రావుతో విబేధించి పార్టీనుంచి బయటకు వచ్చాకా జరిగిన అనేక పరిణామాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వచ్చినవే మున్సిపల్ ఎన్నికలు. ఈ మున్సిపల్ ఎన్నికలను ఒక అవకాశంగా భావించి ముందడుగేస్తారనుకున్న కవిత, ప్రత్యక్షంగా పోటీ చేయకపోవడం రాజకీయంగా అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. ఇది వెనుకడుగేనా? లేక రాజకీయాల్లో మరింత ముందుకు దూసుకెళ్లే ముందు వేసిన వ్యూహాత్మక విరామమా? అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ.
ఎన్నికలను ఎదుర్కొనేందుకు తగినంత కేడర్ పార్టీలో సిద్ధంగా లేకపోవడమే కారణమా? అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే, కేసీఆర్ కుమార్తెగా, జాగృతి అధ్యక్షురాలిగా, బతుకమ్మ సంబురాల నిర్వహణలో, కవితకు ఇప్పటికే గుర్తింపు ఉన్నప్పటికీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా కేడర్ ఆధారిత ఎన్నికలు. గల్లీ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు బలమైన సంస్థాగత వ్యవస్థ అవసరం. ఈ పరిస్థితుల్లో కవిత ప్రత్యక్షంగా పోటీ చేస్తే ఏం జరగొచ్చనేది కవిత అంచనాలు అయి ఉండొచ్చు..అవేంటంటే, కవిత పార్టీ సిద్ధాంతాలు, విధి విధానాలేమిటొ ప్రజల్లోకి వెళ్ళకుండా, పార్టీపై ప్రజల్లో స్పష్టమైన అభిప్రాయం ఏర్పడక ముందే ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగి, ప్రచారం చేసుకోలేక, ఓటమి జరిగితే అది వ్యక్తిగతంగా కవితకే దెబ్బ కావచ్చు. ఆమె రాజకీయ భవిష్యత్ నాయకత్వ ప్రతిష్ఠపై ప్రభావం ఖచ్చితంగా పడొచ్చు. అందుకే, కేడర్‌ను పునర్నిర్మించే దశలో పోటీకి దిగకపోవడమే మంచిదన్న అభిప్రాయానికి కవిత వచ్చినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఎన్నికల్లో పోటీకి దిగే ముందు గెలుపు అంచనాలు ఏ పార్టీకైనా కీలకం. ప్రస్తుతం తెలంగాణ పట్టణ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అధికారంలో ఉంది. సంక్షేమ పథకాలు, పరిపాలనపై ఆశలు ఇంకా పూర్తిగా తరుగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం అంటే గెలుపు కన్నా రిస్కే ఎక్కువగా ఉంటుంది భావించడం వల్లనే కవిత నిర్ణయం కావచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ స్థానిక ఎన్నికల్లో కవిత పోరాడి ఓడితే అది “వ్యక్తిగత పరాజయం” గా ముద్ర పడుతుంది. గెలిచినా కూడా అది స్థానిక స్థాయి వరకే పరిమితం అవుతుంది. కానీ కవిత లక్ష్యం మాత్రం రాష్ట్ర స్థాయి లేదా జాతీయ స్థాయి రాజకీయ పాత్ర అని స్పష్టంగా తెలుస్తున్నది.
అందుకే గెలుపుపై పూర్తి నమ్మకం లేని పరిస్థితుల్లో ఇలాంటి స్థానిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం ఒక సేఫ్ పొలిటికల్ గేం గా చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కవిత ఎదుర్కొన్న రాజకీయ, న్యాయపరమైన పరిణామాల నేపథ్యంలో సానుభూతి పవనాలు సహకరిస్తాయన్న అంచనాలు కొందరిలో ఉన్నాయి. కానీ తక్షణమే ఎన్నికల్లో అవి ఓటుబ్యాంకుగా ఎంతవరకు మారొచ్చనేది ప్రశ్నార్థకమే.
వాటికన్న ముఖ్యమైన స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులు, నీరు, రోడ్లు, పారిశుధ్యం
ప్రత్యక్ష పరిచయాలు, వీటిపైనే ఆధారపడి ఓటర్ల ఆలోచనలు ఆధారపడి ఉంటాయి.

సానుభూతి అనేది ఒక అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల్లో పని చేయొచ్చు కానీ వార్డు స్థాయి రాజకీయాల్లో అది పెద్దగా ప్రభావం చూపదు. కవిత కూడా ఈ వాస్తవాన్ని అర్థం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే సానుభూతి మీద ఆధారపడి పోటీకి దిగడం కన్నా, దీర్ఘకాల వ్యూహానికే ఆమె ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. మున్సిపల్ ఎన్నికలు కవితకు ఒక “టెస్ట్ గ్రౌండ్” కాదు. అసెంబ్లీ ఎన్నికలే ఆమెకు అసలైన వేదిక. . అందుకే అప్పటివరకు కవిత వ్యూహాలు వరుసగా పార్టీ కేడర్ బలోపేతం చేసుకోవడం, మహిళా ఓటర్లలో తమ పార్టీపట్ల విశ్వాసం పెంచుకోవడం, పట్టణ సమస్యలపై స్థిరమైన ప్రచారాస్త్రాలు సిద్ధం చేసుకోవడం, జాతీయ రాజకీయ అనుభవాన్ని రాష్ట్రానికి అనుసంధానం చేసేలా ప్రసంగాలు సిద్ధం చేసుకోవడం అనే అంశాలు కవిత ముందున్న లక్ష్యాలు, సవాళ్ళు.
ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చినట్టయితే, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కవిత ప్రత్యక్షంగా బరిలో దిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా పట్టణ నియోజకవర్గం లేదా మహిళా ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల అంచనా.
ఇవన్నీ సాధించాలంటే ఇప్పుడున్న కొంతమంది సైన్యం పార్టీకి సరిపోరు, ఆమె మరికొంతమంది సమర్థులను పార్టీలోకి ఆహ్వానించవలసి ఉంటుంది. అందుకనే కవిత ప్రస్తుతం పార్టీలోకి కొత్త ముఖాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. కవిత ప్రయత్నాలు ఫలించి, ఆమె పార్టీ సిద్ధాంతాలు, అనుకూల ప్రతికూలతలు అంచనా వేసుకుని పార్టీలోకి ఎవరెవరు వచ్చే అవకాశాలున్నాయని చూస్తే, పట్టణ మహిళా నాయకులు, స్వయం సహాయక సంఘాల నేతలు, యువ మహిళా ప్రొఫెషనల్స్, విద్యావంతులైన మధ్యతరగతి వర్గం, కాంగ్రెస్, బీజేపీల్లో అసంతృప్తిగా ఉన్న మహిళా నేతలు రావొచ్చు.
అలాగే, పట్టణ ప్రాంతాల్లో కొత్త రాజకీయ ఆలోచనలు కోరుకునే యువతను ఆకర్షించే శక్తి కవితకు ఉంది. కల్వకుంట్ల కవిత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఓటమి భయంతో కాదు, భవిష్యత్ రాజకీయ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం అని విశ్లేషకులు అంటున్నారు. ఇది వెనకడుగు కాదు — దూకుడుగా ముందుకు వెళ్లే ముందు వేసిన పునాది. కేడర్ బలోపేతం, కొత్త సామాజిక వర్గాల సమీకరణ, మహిళా రాజకీయానికి కొత్త దిశ. ఇవన్నీ కలిసి కవితను రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో మరింత కీలక పాత్రధారిగా మార్చే అవకాశాలు ఉండొచ్చు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు సమీకరణలు ఎట్నుంచి ఎటైనా మారొచ్చు…ఎవరికైనా అనుకూలంగా, ఇంకెవరికైనా ప్రతికూలంగా మారొచ్చు….
