WTC Table | గెలిచినా లాభం లేకుండా పోయింది…

WTC Table | గెలిచినా లాభం లేకుండా పోయింది…

న్యూచండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టులో శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 564/8 వద్ద డిక్లేర్ చేసిన భారత్, అనంతరం అఫ్గానిస్థాన్‌ను 152 పరుగులకే ఆలౌట్ చేసింది. ఫాలోఆన్ ఆడిన అఫ్గాన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ 112 పరుగులకే కుప్పకూలడంతో భారత్ ఇన్నింగ్స్, 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ విజయంతో ఆఫ్ఘాన్ పై భారత జట్టు ఆధిపత్యం మరోసారి రుజువైనప్పటికీ, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో మాత్రం ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. అఫ్గానిస్థాన్‌పై ఇన్నింగ్స్, 300 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసినా… డ‌బ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో మాత్రం భారత్ ఆరో స్థానంలోనే కొనసాగుతోంది. దీంతో అభిమానుల్లో “ఇంత భారీ విజయం సాధించినా పాయింట్లు ఎందుకు రాలేదు?” అనే సందేహం వ్యక్తమవుతోంది.

అయితే ఈ మ్యాచ్ ప్రస్తుత డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో భాగం కాకపోవడంతో భారత్‌కు ఎలాంటి పాయింట్లు లభించలేదు. అందుకే ఈ విజయ ప్రభావం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పట్టికపై కనిపించలేదు. ప్రస్తుతం 48.15 శాతం పాయింట్లతో భారత్ ఆరో స్థానంలోనే కొనసాగుతోంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ ఇక ముందు ఆడనున్న శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో వరుస విజయాలు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా అగ్రస్థానాల్లో కొనసాగుతుండగా, భారత్‌కు మిగిలిన టెస్టులు అత్యంత కీలకంగా మారాయి.

భారత్ గతంలో 2021, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరినా టైటిల్‌ను అందుకోలేకపోయింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో ఓటమి చవిచూసిన భార‌త్ కు టైటిల్ కల కలగానే మిగిలిపోయింది. అయితే, ఈసారి శుభ్‌మన్ గిల్ సారథ్యంలో మూడోసారి ఫైనల్ చేరి ట్రోఫీని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో టీమిండియా ముందుకు సాగుతోంది.

కాగా, న్యూచండీగ‌డ్ వేదిక‌గా జ‌రిగిన ఈ ఎకైక టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన మానవ్ సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి అఫ్గాన్ బ్యాటర్లను వణికించాడు. రెండో ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. అయినప్పటికీ ఈ గెలుపు గణాంకాలకే పరిమితమైంది.

Leave a Reply