Regional parties India | ప్రాంతీయ పార్టీల వైఫల్యాలకు ఉమ్మడి కారణాలు
Regional parties India | ప్రాంతీయ పార్టీల వైఫల్యాలకు ఉమ్మడి కారణాలు
Regional parties India | ప్రాంతీయ పార్టీల పతనానికి ఉదాహరణలు
అకాలీదళ్, ఎన్సీపీ, శివసేనలో సంక్షోభం
మమతా, లాలూ పార్టీల రాజకీయ పతనం
అనువంశిక రాజకీయాలు, అవినీతి ప్రభావం
Regional parties India | దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఎందుకు భారీగా పతనం అవుతున్నాయి? ఈ అంశం భారత రాజకీయాల్లో ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం అయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగానే ప్రాంతీయ పార్టీలను బలహీనపరుస్తోందన్న ఆరోపణలు తరచూ వస్తున్నాయి.
కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే మాదిరి ఆరోపణలు వచ్చేవి. 1960వ దశకంలో కేంద్రంలో, రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. అప్పుడు ఇదే మాదిరి ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చేందుకు ప్రయత్నించేదన్న ఆరోపణలు వచ్చేవి. ప్రతి ప్రాంతీయ పార్టీని గురించి పరిశీలించడం సాధ్యం కాదు. అయితే, అకాలీదళ్, శివసేన, ఎన్సీపీ, ఆర్జేడీ, బీజేడీ, జేడీయుల పతనాన్ని పరిశీలిస్తే కొన్ని విషయాలు బహిర్గతం అవుతాయి.
ప్రాంతీయ పార్టీల పతనానికి ఉదాహరణలు:
అకాలీదళ్: పంజాబ్‌లో అకాలీదళ్ పార్టీని 1920లో స్థాపించారు. 1977 తర్వాత ప్రకాష్ సింగ్ బాదల్ ఆ పార్టీకి ప్రముఖ నాయకులయ్యారు. ఆయన చాలా కాలం పార్టీని నడిపించారు. ఆయన వారసునిగా కుమారుడు సుఖబీర్ సింగ్ బాదల్ పార్టీ నాయకత్వం చేపట్టారు. పంజాబ్‌లో ప్రధాన రాజకీయశక్తిగా ఉండిన అకాలీదళ్ ఇప్పుడు నామమాత్రంగా మిగిలింది. సుఖబీర్ నేతృత్వంలో అకాలీదళ్ అవినీతి, నాయకత్వ లోపం, అహంకారం మొదలైన కారణాల వల్ల అకాలీదళ్ పతనమైందని చాలామంది పేర్కొంటూ ఉంటారు.
శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపీ: మాజీ ఉపప్రధాని శరద్ పవార్ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని (ఎన్సీపీని) 1990వ దశకంలో స్థాపించారు. ఆ పార్టీ అతి త్వరలోనే మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. ఇటీవల కాలంలో ఆ పార్టీ బలహీనపడింది. పార్టీలో చీలిక వచ్చింది. శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ ఆయనకు దూరమై, సొంత కుంపటిని ఏర్పాటు చేసుకోవడం వల్లనే ఆ పార్టీ బలహీన పడిందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. పవార్ పార్టీకి ఇప్పుడు ఆయన కుమార్తె సుప్రియ సూలే నాయకత్వం వహిస్తున్నారు.
ఉద్ధవ్ థాకరే, శివసేన: ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా 2019లో అయ్యారు. ఆయన ప్రభుత్వం 2022 జూన్‌లో పడిపోయింది. శివసేన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఆయనపై తిరుగుబాటు చేశారు. ఉద్ధవ్ థాకరే కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదనీ, పాలనా పరమైన నైపుణ్యం ఆయనకు లేదని పలువురు కార్యకర్తలు ఆరోపించారు. అంతేకాక, ఉద్ధవ్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. విశేషమేమిటంటే, ఉద్ధవ్ తండ్రి, అవిభక్త శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే తరచూ ఏమనేవారంటే తమ కుటుంబ సభ్యులు నేరుగా ప్రభుత్వాన్ని నడిపించరాదనీ, సలహాలు ఇచ్చి నడిపించాలనీ. అందుకు భిన్నంగా ఉద్ధవ్ ముఖ్యమంత్రి అయ్యారు. తన కుమారుడు ఆదిత్యను సీనియర్ మంత్రిగా చేశారు.

మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్: మమతా బెనర్జీ 2011లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె అధికారాలన్నీ తన వద్దనే ఉంచుకునే వారనీ, ఎవరినీ లెక్క చేయరనీ, పరిపాలనలో అలసత్వం, అసమర్థత కారణంగా ఆమె గత నెలలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని చెబుతారు. ఆమె ఓటమికి మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం, అహంకారాన్ని ప్రదర్శించడం కారణాలని చెబుతారు.
లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్జేడీ: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) 1990వ దశకంలో బీహార్ రాజకీయాలను శాసించింది. 2005 వరకు ఆ పార్టీ అధికారంలో ఉంది. లాలూ అధికారం నుంచి తప్పుకోవల్సి వస్తే తన భార్య రబ్రీ దేవిని ముఖ్యమంత్రి చేశారు. ఆ తర్వాత తేజస్వి యాదవ్ ప్రధాన నాయకుడయ్యారు. ఆర్జేడీ ప్రధానంగా కుటుంబ పార్టీ అవడం వల్లనే ప్రజలకు దూరమైందని విమర్శకులు పేర్కొంటున్నారు. అనువంశిక రాజకీయాలే ఆ పార్టీని దెబ్బతీశాయి.
ప్రాంతీయ పార్టీలు ఎదుర్కొంటున్న సమస్యల జాబితా చాలా పెద్దది. వీటిలో ఉమ్మడి సమస్యలు ఉన్నాయి. వాటి పతనం వెనుక కూడా ఉమ్మడి కారణాలున్నాయి.
వైఫల్యాలకు ఉమ్మడి కారణాలు:
అనువంశిక రాజకీయాలు: ప్రాంతీయ పార్టీలకు ఒకే కుటుంబం ఆధిపత్యం వహిస్తుంది. పార్టీని వృద్ధిలోకి తీసుకురావడానికి ఎంతో కష్టపడిన సీనియర్ నాయకులను పక్కకు తప్పిస్తారు. ఇదే పార్టీలో అంతర్గత ఘర్షణలకు కారణమవుతుంది. చీలికలకు కారణమవుతుంది. పార్టీలోని యువతరం దీనిని సరిపెట్టుకోలేకపోతోంది. వంశపారంపర్య రాజకీయాలను యువతరం వ్యతిరేకిస్తోంది.
అవినీతి ఆరోపణలు: ప్రాంతీయ పార్టీల్లో ప్రధానంగా కనిపించేది అవినీతి ఆరోపణలు. పార్టీ నాయకులు ఆరోపణలను ఎదుర్కోవడం, జైలుకు వెళ్లడం ఉమ్మడిగా కనిపించే అంశం. ఈ పార్టీల్లో అవినీతి తీవ్రమైన అంశమని చాలా మంది చెబుతూ ఉంటారు.
నాయకత్వం అహంకారం: ప్రాంతీయ పార్టీల నాయకులు అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సెలబ్రిటీలు అహంకారంతో నెట్టుకొస్తారు. కానీ రాజకీయవేత్తలు ప్రజాబలంతో అధికారంలో కొనసాగుతారు. మద్దతుదారులకు దూరం అయినవారు అధికారానికి దూరం అవుతూ ఉంటారు. జరుగుతున్నది ఇదే.
పరిపాలనలో పేలవత్వం: అనువంశిక పాలన మాత్రమే కాకుండా అవినీతి ఆరోపణలు ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తున్నాయి. అంతేకాకుండా సరైన పాలన లేకపోవడం కూడా ఒక కారణం. ఆర్థిక పరమైన బలహీన పరిస్థితి, కులాలు, ఇతర వర్గాలపై అతిగా ఆధారపడటం, మతపరమైన కారణాలు మొదలైన వాటివల్ల ప్రాంతీయ పార్టీలు క్షీణిస్తున్నాయి.
నేర్చుకోవలసిన పాఠాలు: ఒడిశాకు 24 ఏళ్ల పాటు సీఎంగా పని చేసిన నవీన్ పట్నాయక్ చక్కని ఉదాహరణ. రాజకీయ అనువంశికంపై ఆయన ఆధారపడలేదు. ఆయన పాలనలో అవినీతి ఆరోపణలు ఎక్కువ రాలేదు. రాష్ట్రాన్ని ఆయన మంచిగా పరిపాలించారు. ప్రాంతీయ పార్టీల పతనానికి అవే కారణాలు. ఇతరులను నిందించడం ఎందుకు?
ప్రాంతీయ పార్టీలను బీజేపీ మింగేస్తోందన్న ఆరోపణలు మీడియా చర్చల్లో తరచూ వస్తున్నాయి. కాంగ్రెస్ ఇతర పార్టీలను తమ పార్టీలో కలుపుకోవాలని చూస్తోందన్న అభిప్రాయం కూడా ఉంది. రాజకీయాల్లో పోటీ తత్వం పెరిగింది. ఓడిన వారి పట్ల సానుభూతి చూపరు. కొన్ని దేశాల్లో ఓడిన నాయకులు జైళ్లలో మగ్గడమో, నికృష్టమైన జీవనం గడపడమో చూస్తున్నాం. ప్రాంతీయ పార్టీల పతనానికి అవినీతి, బంధుప్రీతి, ఆశ్రీత పక్షపాతం ప్రధాన కారణాలు. ప్రాంతీయ పార్టీలు మారుతున్న వాస్తవాలను దృష్టిలో ఉంచుకుంటే అవి నిలదొక్కుకోగలుగుతాయి. అలా చేయలేకపోతే అవి రాజకీయ యవనికపై నుంచి తెరమరుగు అవుతాయి. ఇతరులను నిందించడం ఎందుకు? మార్పులను ఆహ్వానించవల్సిందే, లేదా కాలగర్భంలో కలిసిపోవల్సిందే.
— డా. పెంటపాటి పుల్లారావు
