Telangana government schools | అల్పాహారం పథకం అమలులో జాప్యం

Telangana government schools | అల్పాహారం పథకం అమలులో జాప్యం

Telangana government schools | బడిబాట కార్యక్రమం విఫలం
మౌలిక సదుపాయాల కొరతతో ప్రభుత్వ పాఠశాలలు
ఉపాధ్యాయులపై అదనపు ఎన్నికల బాధ్యతలు
విద్యా వ్యవస్థపై విద్యార్థి సంఘాల ఆందోళన

Telangana government schools | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని, సర్కారు బడులను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలిస్తే ప్రభుత్వ మాటలకు, పనులకు పొంతన లేకపోతోంది. విద్యార్థులను ఆకర్షించడానికి ప్రవేశపెట్టిన పథకాలు అమలుకు నోచుకోకపోగా, ఉన్న సౌకర్యాలు కూడా కరువవుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తొలుత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ వర్తింపజేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసింది. కానీ, అమలు చేసే సమయానికి చేతులెత్తేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు దాదాపు 26.81 లక్షల మంది విద్యార్థులు ఉండగా, తొలి విడతలో కేవలం 1.44 లక్షల మందిని మాత్రమే ఎంపిక చేయడం గమనార్హం. మొత్తం 1,302 విద్యాసంస్థల్లో (1,269 పాఠశాలలు, 33 కళాశాలలు) మాత్రమే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. మిగిలిన 25 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా అల్పాహారం సరఫరా చేస్తామని చెబుతున్న ప్రభుత్వం, పాఠశాలలు ప్రారంభమై ఇన్ని రోజులైనా ఆ కిచెన్ల ఏర్పాటును పూర్తి చేయకపోవడంపై విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఒకే చోట అత్యాధునిక యంత్రాలతో భారీ ఎత్తున వందలాది పాఠశాలలకు సరిపడా ఆహారాన్ని సిద్ధం చేసే కేంద్రీకృత కిచెన్‌ను సెంట్రలైజ్డ్ కిచెన్ అంటారు. ఇక్కడి నుంచి సిద్ధం చేసిన ఆహారాన్ని ప్రత్యేక వాహనాల ద్వారా ఆయా పాఠశాలలకు సరఫరా చేస్తారు.

ఈ కిచెన్లలో వందల కిలోల ఉప్మా, ఇడ్లీ వంటివి నిమిషాల్లో తయారవుతాయి. యంత్రాల ద్వారా వంట జరగడం వల్ల పరిశుభ్రత ఎక్కువగా ఉంటుంది. నాణ్యతా ప్రమాణాలను ఒకే చోట పర్యవేక్షించడం ప్రభుత్వానికి సులభమవుతుంది. వండిన అల్పాహారం వేడిగా ఉండటం కోసం ఇన్సులేటెడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రల్లో ప్యాక్ చేస్తారు. దీనివల్ల వండిన 3 నుంచి 4 గంటల వరకు ఆహారం వేడిగానే ఉంటుంది. ప్రత్యేక వాహనాల రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి పాఠశాలలకు పంపిణీ చేస్తారు. పాఠశాలలు ప్రారంభం కాకముందే ప్రణాళిక ఎందుకు లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక జూనియర్ కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్ ఊసే లేకపోవడం విద్యార్థులను నిరాశకు గురిచేస్తోంది.

విఫలమైన బడిబాట

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను 10 శాతం మేర పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న జయశంకర్ బడిబాట కార్యక్రమం విఫలమైంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ ఉపాధ్యాయులను జనగణన, ఇతర సర్వే పనుల్లో నిమగ్నం చేయడమే. ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి విద్యార్థులను చేర్పించాల్సిన సమయంలో, ప్రభుత్వం వారిని గణాంక సేకరణకు కేటాయించింది. ఫలితంగా అడ్మిషన్లు 5 శాతం కూడా దాటలేదని విమర్శలు వస్తున్నాయి.

బడి తెరిచిన రోజే విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు అందజేస్తామని చెప్పిన మాట నీటి మూటగానే మిగిలింది. ఇప్పటివరకు సగం మంది విద్యార్థులకు కూడా యూనిఫామ్స్ అందలేదు. ఇక మన ఊరు – మన బడి కింద స్కూళ్ల రినోవేషన్ పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. వందలాది పాఠశాలల్లో కనీసం టాయిలెట్స్ లేవు, తాగడానికి నీరు లేదు. వర్షాకాలం మొదలైనా శిథిలావస్థలో ఉన్న గదుల్లోనే విద్యార్థులు చదువుకోవాల్సి వస్తోంది. మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యార్థులు సర్కారు బడులకు ఎలా వస్తారని టీచర్ల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

అడ్మిషన్ల వేళ.. బీఎల్ఎల శిక్షణకు టీచర్లు

ప్రస్తుతం పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఉపాధ్యాయులను ఎన్నికల విధుల వైపు మళ్లిస్తోంది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోని సబ్జెక్టు టీచర్లు, హెడ్‌మాస్టర్లను బూత్ లెవల్ ఆఫీసర్లుగా (బీఎల్ఓ) నియమించి, వారికి బుధవారం నుంచి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. విద్యాబోధనపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఉపాధ్యాయులను ఇలాంటి రాజకీయ, పరిపాలనా పనులకు వాడటం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కేవలం ప్రకటనలతో కాలక్షేపం చేస్తోందని, క్షేత్రస్థాయిలో విద్యార్థులకు ఒరిగిందేమీ లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.