18thJunechintana | ఇంద్రుడికి దధ్య మహర్షి చెప్పిన బ్రహ్మజ్ఞాన గాథ

18thJunechintana | ఇంద్రుడికి దధ్య మహర్షి చెప్పిన బ్రహ్మజ్ఞాన గాథ

18thJunechintana | బ్రహ్మజ్ఞానం కోసం దధ్య మహర్షిని ఆశ్రయించిన ఇంద్రుడు
భోగం-మోక్షం మధ్య ఉన్న శాశ్వత వైరుధ్యం
మహర్షి బోధను అపార్థం చేసుకున్న దేవేంద్రుడు
సుఖం మూర్ఖత్వానికి దారితీస్తుందనే నీతి

18thJunechintana | ఒకసారి ఇంద్రుడికి బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలనిపించింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? పరివారాన్ని పంపించి లోకంలో బ్రహ్మజ్ఞాని ఎవరో కనుక్కుని రమ్మన్నాడు. పరివారం అన్ని లోకాలు తిరిగారు. చివరకు భూలోకంలో “దధ్యుడు” అనే మహర్షి బ్రహ్మజ్ఞాని అని తెలుసుకున్నారు. అదే విషయాన్ని దేవరాజైన ఇంద్రుడికి నివేదించారు.

సరే, ఇంద్రుడు బ్రహ్మజ్ఞానం తెలుసుకోవటానికి దధ్యుడి దగ్గరకు బయల్దేరాడు. ఒక మహారణ్యం మధ్యలో చిన్న పర్ణశాల నిర్మించుకుని నివశిస్తున్నాడు దధ్యుడు. అతని ఆశ్రమానికి వచ్చాడు ఇంద్రుడు. సాక్షాత్తు దేవతల రాజైన ఇంద్రుడు తన ఆశ్రమానికి వచ్చాడని తెలియగానే దధ్యుడు ఎదురు వెళ్లి స్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు ఇంద్రుణ్ణి.

కుశల ప్రశ్నలైన తరువాత, “దేవేంద్రా! నువ్వు చాలా పెద్దవాడివి. దేవతలకు రాజువు. అటువంటి నీకు నాతో పని ఏమిటి? నా ఆశ్రమానికి విచ్చేసిన కారణం ఏమిటి? నేను నీకు ఏమి చేయగలనో చెప్పవలసింది” అన్నాడు.

అప్పుడు ఇంద్రుడు మెల్లిగా తాను వచ్చిన పని బయటపెట్టాడు.

“నాకు బ్రహ్మజ్ఞానం కావాలి. అది నువ్వే చెప్పాలి” అన్నాడు.

ఆ మాటలు విన్న దధ్యుడు ఒక్కసారిగా గతుక్కుమన్నాడు. వచ్చినవాడు ఇంద్రుడు. అపరిమితమైన భోగలాలసుడు. నిరంతరం అప్సరాంగనలతో క్రీడిస్తూ ఉంటాడు. ఇతడు అడిగేది సర్వసంగ పరిత్యాగులు కోరుకునే బ్రహ్మజ్ఞానం.

యత్రాపి భోగో న చ తత్ర మోక్షః!
యత్రాపి మోక్షో న చ తత్ర భోగః!!

ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు. ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు. ఈ రెండింటికీ లంకె కుదరదు. ఇంద్రుడు పూర్తిగా భోగి. అలాంటి వాడికి మోక్షకారకమైన బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించడం ఎలా?

మళ్లీ అడిగాడు ఇంద్రుడు.

“ఏం మహర్షీ! నాకు బ్రహ్మజ్ఞానం కావాలి. చెబుతావా? చెప్పవా?”

ఈసారి కూడా ఏం మాట్లాడలేదు దధ్యుడు. అలాగే మౌనంగా ఆలోచిస్తున్నాడు.

మళ్లీ ఇంద్రుడే అన్నాడు.

“మహర్షీ! ఇందాక నా కోరిక తీరుస్తానని మాట ఇచ్చావు. మరి ఇప్పుడు ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇంతకీ నాకు బ్రహ్మజ్ఞానం బోధిస్తావా? లేదా?” అన్నాడు. తాను ఇచ్చిన మాటను పట్టుకుని ఇంద్రుడు వత్తిడి చేస్తున్నాడు. చేయగలిగింది ఏమీ లేదు. అందుకని “సరే! అలాగే చెబుతాను. రేపు ఉదయం నా శిష్యులతో బాటుగా రా!” అన్నాడు.

మరునాడు తెల్లవారింది. దైనందిన కార్యక్రమాలు ముగించుకుని కూర్చున్నాడు మహర్షి. శిష్యులు ఒక్కొక్కరే వచ్చి గురువుగారికి అభివాదం చేసి, ఆయనకు అభిముఖంగా కూర్చుంటున్నారు. వాళ్లలో చివరగా ఇంద్రుడు ఒంటి మీద వస్త్రాలు, ఆభరణాలు అన్నీ తీసివేసి, గోచీ పెట్టుకుని, చేతిలో దర్భలు పట్టుకుని వచ్చాడు. మహర్షికి నమస్కరించి, మిగిలినవారితో పాటు తనూ కూర్చున్నాడు.

చెప్పటం మొదలుపెట్టాడు మహర్షి.

“నాయనలారా! ఈ జగత్తు అంతా మిథ్య. కంటికి కనిపించేది ఏదీ సత్యం కాదు. ఇదంతా అశాశ్వతమైనది. అంతా నశించేదే. ఈ జగత్తంతా ఒక భ్రమ. పదవులు, అధికారం, రాజ్యం అంతా భ్రమ. ఇక్కడ రాజ్యం లేదు. అధికారం లేదు.” ఇలా సాగిపోతోంది మహర్షి బోధ.

ఒక్కసారిగా కోపం వచ్చింది ఇంద్రుడికి. ఇతడు చెప్పేదంతా తన గురించే. తాను ఇక్కడికి వచ్చాడని ఎద్దేవా చేస్తున్నాడు అనుకుని వెంటనే లేచి, “మహర్షీ! నువ్వు కావాలనే నన్ను అవమానిస్తున్నావు. కంటికి కనిపించేదంతా నిజం కాదు అంటున్నావు. రాజ్యం, అధికారం లేదు అంటున్నావు. ఈ మాటలన్నీ నన్ను ఉద్దేశించే చెబుతున్నావు. ఇక్కడ లేనిది ఏమిటి? నా రాజ్యమా? నా అధికారమా? ఆ రెండూ ఉన్నాయే. నా అప్సరసలు, భోగాలు ఇవన్నీ నిజమే కదా! అయినా నువ్వు కావాలని ఇలా అబద్ధాలు చెబుతున్నావు. బ్రహ్మజ్ఞానం అంటూ మళ్లీ ఇలాంటి తప్పుడు మాటలు ఇంకెవరికైనా చెప్పావంటే నా వజ్రాయుధంతో నీ తల నరికి వేస్తాను. జాగ్రత్త!” అని హెచ్చరించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. సుఖంలో ఉంటే మూర్ఖత్వం కమ్మేస్తుందని ఇందుకే అంటారు.

– కామిడి సతీష్ రెడ్డి
9848445134