టెండర్ల పేరుతో వేల కోట్లు హాంఫట్..!
టెండర్ల పేరుతో వేల కోట్లు హాంఫట్..!
పనికిరాని బియ్యానికి కారుచౌక ధరకు వేలం
రసాయనాలతో రీ-పాలిషింగ్ స్కెచ్‌పై ఆరోపణలు
తిమింగలాలకు టెండర్లు.. కాగితాలపైనే నిబంధనలు?
దొడ్డు బియ్యం పనికిరాని బియ్యానికి బహిరంగ వేలం… వేల కోట్ల దోపిడీకి, వర్క్ ఆర్డర్ రాజముద్ర? గోదాముల్లో ముక్కిన బియ్యానికి రసాయనాల మెరుగుల స్కెచ్… బడా మిల్లర్ల గుప్పెట్లో పౌర సరఫరాల సంస్థ.
ఆంధ్రప్రభ నిఘావిభాగం, హైదరాబాద్: పేదల కడుపు నింపాల్సిన పౌరసరఫరాల సంస్థ పెద్దల పాలిట కామధేనువుగా మారిందా? లూటీగాళ్ల దోపిడీకి ప్రభుత్వ గోదాములే వేదికలవుతున్నాయా? అంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్న దందా తీరు అవుననే సమాధానం వస్తోంది.
ఏళ్ల తరబడి గోదాముల్లో నిల్వ ఉండి, ముక్కిపోయి, పురుగులు పట్టి, మనుషులు తినడానికి కూడా పనికిరావని తేల్చేసిన దొడ్డు బియ్యం ఎస్ఆర్కే వేలం చుట్టూ వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతోంది. ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని కాపాడాల్సిన వ్యవస్థే అక్రమార్కులకు ఎర్రతివాచీ పరుస్తూ, కొందరు బడా తిమింగలాల జేబులు నింపడానికి జీ హుజూర్ అంటోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ (టీజీ ఎస్సీఎస్సీఎల్) 2026 జూన్ 11న జారీ చేసిన తాజా వర్క్ ఆర్డర్ ఈ దోపిడీకి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. గోదాముల్లో మూలుగుతున్న 56,555 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని కేవలం రూ.122.7 కోట్ల కారుచౌక ధరకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ రైస్ మిల్లుకు కట్టబెట్టినట్టు తెలుస్తోంది.
టన్నుకు కేవలం రూ.21,700 (అంటే కిలో రూ.21.70) చొప్పున తెగనమ్మేసిన ఈ అక్రమ దందా వెనుక రాష్ట్రవ్యాప్తంగా అక్షరాలా వేల కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకున్నదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వ లెక్కల్లో పనికిరావని తేల్చేసిన బియ్యం చివరకు ఎటు దారిమళ్లుతున్నదో, దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరో అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే నాథుడే కరువయ్యాడని చెబుతున్నారు.
పశువుల దాణా బియ్యాన్ని.. రీ పాలిషింగ్…
టెండర్ నిబంధనల ప్రకారం ఈ బియ్యాన్ని కేవలం పశువుల దాణాగానో, ఇథనాల్ తయారీ వంటి పారిశ్రామిక అవసరాలకో మాత్రమే దేశీయంగా ఉపయోగించాలి. కానీ ఇదంతా పైకి కనిపించే కాగితపు వ్యవహారమే. లోపల జరుగుతున్న కథ అసలు సిసలైన దోపిడీ.
కొందరు బడా రైస్ మిల్లర్లు, దళారులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకొని, ఈ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా రైస్ మిల్లులకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోదాముల్లో నాణ్యత కోల్పోయిన ఆ ముక్కిన బియ్యానికి రసాయనాల సాయంతో రంగు మార్చి, రీ-పాలిషింగ్, సిల్కీ ప్రాసెస్ చేసి, కొత్త బియ్యంలా మార్కెట్లోకి పంపించే ప్రణాళికను సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకోవడంతోపాటు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేసి వేల కోట్ల రూపాయలు దిగమింగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. నాణ్యత లేని, రసాయనాలు కలిపిన ఈ బియ్యాన్ని మళ్లీ జనం కడుపుల్లోకి నెట్టి వారి ఆరోగ్యంతో, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తిమింగలాలకు టెండర్లు..? కాగితాలపైనే నిబంధనలు…
ఈ వేలం ప్రక్రియలో అసలు లబ్ధిదారులు ఎవరు? టెండర్ షరతులు చాలా కఠినంగా ఉన్నాయని అధికారులు చెబుతున్న మాటల్లో నిజం ఎంత అనేది ప్రశ్నార్థకంగా మారింది.
బియ్యాన్ని కొనుగోలు చేసిన వారు మిల్లర్లకు తిరిగి అమ్మకూడదనే స్పష్టమైన నిబంధన ఉన్నప్పటికీ, పరోక్షంగా అదే రైస్ మిల్లర్ అసోసియేషన్ పెద్దల చేతుల్లోకి స్టాక్ మొత్తం వెళ్తోందనే ఆరోపణలు ఉన్నాయి.
అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఈ టెండర్ ప్రక్రియను మూడు లాట్లుగా విభజించి, ఒక లాట్ను కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ప్రముఖ మిల్లర్ల సంఘం నేతకు కట్టబెట్టగా, మిగిలిన రెండు లాట్లను తమిళనాడు, కర్ణాటకకు చెందిన వ్యక్తులకు దక్కేలా తెరవెనుక పావులు కదిపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్ల ప్రక్రియ మొత్తం కొందరు బడా తిమింగలాల ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగానే జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
క్షేత్రస్థాయిలో నిల్వలు మాయం..
ఈ కుంభకోణం ఇంతటితో ఆగడం లేదు. దీని వెనుక ఉన్న అసలు తిమింగలాల లీలలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో సన్నబియ్యం పథకం ప్రారంభమైన సమయంలో రేషన్ షాపులు, ఎంఎల్ఎస్ పాయింట్లు, బఫర్ గోదాముల్లో మిగిలిపోయి క్షేత్రస్థాయిలో మాత్రం స్టాక్ లేనట్టు రికార్డుల్లో నమోదు చేసినట్టు సమాచారం.
నిల్వలను ముందే విక్రయించారన్న ఆరోపణలు వెల్లువలా సాగుతున్నాయి. అధికారుల అండదండలతో కొంత మేర నిల్వలను అక్రమంగా, నల్లబజారుకు తరలించి భారీగా సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ దొడ్డు బియ్యం మాయం వెనుక పౌరసరఫరాల శాఖ అధికారుల హస్తం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గోదాముల్లో అసలు స్టాక్ ఉందో లేదో కూడా పరిశీలించకుండా వేలం తంతును ముగించిన ఉన్నతాధికారుల పాత్రపై స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
రెండేళ్ల ముందే పడిన పునాది.. కావాలనే కాలయాపన?
సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌లో అసలు దోపిడీకి రెండేళ్ల ముందే బీజం పడిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సన్నబియ్యం పథకం ప్రారంభమైన సమయంలో మిగిలిపోయిన దొడ్డు బియ్యాన్ని అప్పట్లోనే వేలం వేసి ఉంటే ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని చెబుతున్నారు.
కానీ రెండున్నర సంవత్సరాలపాటు టెండర్లను పిలవకుండా కాలయాపన చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ప్రభుత్వం కిలోకు దాదాపు రూ.45 చొప్పున కొనుగోలు చేసిన బియ్యాన్ని ఇప్పుడు రూ.21.70కే విక్రయించడం వల్ల కార్పొరేషన్‌కు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
టెండర్లలో దోపిడీకి అన్నదాతల ఆర్తనాదాలే సాక్ష్యాలు..
పౌరసరఫరాల శాఖలో బడా తిమింగలాలు, అధికారులు కలిసి నడిపిన దొడ్డు బియ్యం కుంభకోణం క్షేత్రస్థాయిలో సామాన్య అన్నదాతల నడ్డి విరిచిందనే ఆరోపణలు ఉన్నాయి.
లాభాల కక్కుర్తితో రెండున్నర ఏళ్ల పాటు గోదాముల్లోని పాత నిల్వలను వేలం వేయకుండా తొక్కిపెట్టడం వల్ల ప్రభుత్వ నిల్వ కేంద్రాలన్నీ పూర్తిగా నిండిపోయాయి. దీనివల్ల రైతులు కొత్తగా పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినప్పుడు అన్లోడింగ్ చేయడానికి స్థలం లేదంటూ అధికారులు కొనుగోళ్లను ఆలస్యం చేశారు.
ఫలితంగా లక్షలాది టన్నుల వరి ధాన్యం ఓపెన్ యార్డుల్లో నిలిచిపోయి, అకాల వర్షాలకు తడిసి మొలకలు రావడంతో రైతులు కన్నీటిపర్యంతం అయ్యారు. ప్రభుత్వ వైఫల్యం, మిల్లర్ల కుమ్మక్కు వల్ల చెల్లింపులు ఆలస్యమై, రైతులు అప్పులపాలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాధనం దోపిడీ.. ప్రజారోగ్యానికి ముప్పు..
నాణ్యత కోల్పోయిన ఈ బియ్యాన్ని అప్పట్లోనే విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉన్నా పట్టించుకోకుండా ఇప్పుడు రసాయనాల మెరుగులతో, రీ-పాలిషింగ్ దందాకు తెరలేపడం వెనుక పెద్ద నెట్వర్కే నడుస్తోందని సమాచారం.
ప్రభుత్వం ప్రజల సొమ్ముతో వేల కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ధాన్యం చివరకు అక్రమార్కుల పాలు కావడం ముమ్మాటికీ పరిపాలనా వైఫల్యం అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల గండి పడుతుంటే, మరోవైపు ముక్కిపోయిన బియ్యం రీ-పాలిషింగ్ రూపంలో మార్కెట్లోకి వచ్చి సామాన్యుడి ప్రాణాల మీదకు ప్రమాదం తెచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ భారీ కుంభకోణంలో ఫైళ్లు తొక్కిపెట్టి, క్షేత్రస్థాయిలో నిల్వలు లేకపోయినా వేలం నాటకమాడిన అధికారులపై తక్షణమే అత్యున్నతస్థాయి విచారణ జరిపించాలని సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి.
