- అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం…
- అట్టహాసం గా శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం….
- మారుమ్రోగిన గోవింద నామ స్మరణ..
- పెద్దఎత్తున అన్నసంతర్పణ…
- వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ…
- ఒప్పిచర్లలో పండుగ వాతావరణం…
(ఆంధ్రప్రభ, కారంపూడి) : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కమనీయంగా జరిగింది. మండలంలోని ఒప్పిచెర్ల గ్రామంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అష్టమ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. శనివారం ఆలయ 8వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనాధ శాస్త్రి ఆధ్వర్యంలో పురోహితులు స్వామివారు అమ్మవార్ల కళ్యాణాన్ని వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కళ్యాణ వేడుకలను తిలకించేందుకు ఒప్పిచెర్ల గ్రామం, కారంపూడి చుట్టుపక్కల గ్రామాల నుండి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని కనులారా చూసి తరించారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వారి కళ్యాణ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని భక్తులు పెద్ద ఎత్తున భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. ఇటు స్వామి వారి కళ్యాణం, అన్నసంతర్పణ కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ, పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.