ఇంటి పెరట్లో గంజాయి మొక్కలు.. వ్యక్తి అరెస్ట్
నస్పూర్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తిని నార్కోటిక్స్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం నిర్వహించిన సంయుక్త దాడుల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
నార్కోటిక్స్, టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ లచ్చన్న ఆధ్వర్యంలో సిబ్బంది, నస్పూర్ టౌన్ పోలీసులతో కలిసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నమ్మదగిన సమాచారంతో నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో గాయత్రినగర్‌కు చెందిన బోడకుంటి ప్రభాకర్ ఇంటి ఆవరణలో తనిఖీలు చేపట్టారు.
తనిఖీల్లో ఇంటి పెరట్లో రెండు గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు రెండు మీటర్ల ఎత్తు ఉన్న ఈ మొక్కల విలువ రూ.20 వేల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. మొక్కలను స్వాధీనం చేసుకుని, నిందితుడిని తదుపరి చర్యల కోసం నస్పూర్ పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లచ్చన్న తెలిపారు. ప్రాంతంలో గంజాయి, మాదకద్రవ్యాల విక్రయాలు, సాగుపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
