తిరువనంతపురం – ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత విదేశాంగ విధానాన్ని ప్రపంచ దేశాలకు వివరించేందుకు తనను ఎంపిక చేయడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించే బాధ్యతను తనపై విశ్వాసంతో అప్పగించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశాన్ని బలోపేతం చేసేందుకు అన్ని వర్గాల వారిని కలుపుకుని వెళ్లాలన్న కృతనిశ్చయం ప్రధాని నిర్ణయంలో ప్రతిఫలిస్తోందని వ్యాఖ్యానించారు.
సంక్లిష్ట ఆంగ్ల భాషలో లేఖ రాసిన శశి థరూర్.. ప్రస్తుత పరిస్థితులను ప్రతిఫలించేలా పదజాలాన్ని ఎంచుకున్నట్టు వివరించారు. తన తార్కిక, భాషా పటిమకు అనుగుణంగా ప్రధాని మోదీ ఎంపిక ఉందని వ్యాఖ్యానించారు. విమర్శకులను తికమక పెట్టేలా ఉన్న ప్రధాని నిర్ణయం అత్యున్నత పాలనా ప్రమాణాలకు అనుగుణంగా ఉందనీ కితాబునిచ్చారు. మిలిటరీ చర్యల తర్వాత భారత్ వ్యూహాత్మక అవసరాలను ప్రపంచ వేదికలపై వివరించేందుకు తనను, ఇతర ఎంపీలను మోదీ ఎంపిక చేశారని అన్నారు. స్వతంత్ర అభిప్రాయాలున్న వ్యక్తులకు ప్రాధాన్యం ఉంటుందన్న రాజకీయ సంకేతం కూడా ఇందులో ఇమిడి ఉందని తెలిపారు. దౌత్యపరంగానూ ఇది తగిన చర్యని అభిప్రాయపడ్డారు.
ఇంతటి ప్రాధాన్యత కలిగిన చర్యకు అదే స్థాయిలో సంక్లిష్ట భాషతో జవాబిచ్చానని శశిథరూర్ అన్నారు. భారత్ ఉద్దేశాలు, ఆందోళనను ప్రపంచ దేశాలు అర్థం చేసుకునేలా తన దౌత్య పరిజ్ఞానం, భాషా నైపుణ్యాలతో వెల్లడిస్తానని అన్నారు. వివిధ దేశాల వారికి చేరేలా భారత వాణిని తగిన రీతుల్లో వినిపిస్తానని మాటిచ్చారు. ఈ మిషన్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ భారతదేశ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉంటానని తెలిపారు.