ప్రభుత్వ విద్యపై పెరుగుతున్న నమ్మకం

ప్రభుత్వ విద్యపై పెరుగుతున్న నమ్మకం
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
వెల్గటూర్ ఆంధ్ర ప్రభ : రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న మార్పులతో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరిగిందని, ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో రోజురోజుకీ ప్రవేశాల సంఖ్య పెరుగుతుందని రాష్ట్ర రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తున్నారన్నారు.

ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం, సాంకేతిక విద్యను అందించడానికి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని లక్ష్యంతో విద్యార్థులకు అందించే ఆహార విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని డైట్ అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా కాస్మెటిక్ చార్జీలను పెంచి ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. చదువు ద్వారానే సమాజంలో మార్పులు వస్తున్నాయన్నారు.

