పాక్ సిబ్బందితో ఒడిశా పరదీప్ పోర్టుకు చేరిన నౌక
‘ఎమ్‌టీ సైరెన్ II’లో 21 మంది పాకిస్థానీలు
భారత్-పాక్ ఉద్రిక్తతల నడుమ భద్రత కట్టుదిట్టం
ముడి చమురు అన్‌లోడ్ వరకు సిబ్బందికి నిర్బంధం
పరదీప్ – ఒడిశాలోని పరదీప్ ఓడరేవులో బుధవారం ఉదయం ఒక నౌక రాకతో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. పాకిస్థాన్‌కు చెందిన 21 మంది సిబ్బంది ఈ నౌకలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
‘ఎమ్‌టీ సైరెన్ II’ అనే పేరుగల ఈ వాణిజ్య నౌక దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా పరదీప్ పోర్టుకు చేరుకుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) కోసం ఈ నౌక ముడి చమురును రవాణా చేస్తోంది. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా, సాధారణ తనిఖీల్లో భాగంగా వారిలో 21 మంది పాకిస్థానీయులని అధికారులు గుర్తించారు.
ఈ సమాచారం ఇమిగ్రేషన్ అధికారుల ద్వారా వెలుగులోకి రావడంతో, ఒడిశా మెరైన్ పోలీసులు, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్) సిబ్బంది తక్షణమే అప్రమత్తమయ్యారు. మెరైన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బబితా దుహేరి వెల్లడించిన వివరాల ప్రకారం, పోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రతను గణనీయంగా పెంచారు. ప్రస్తుత సున్నిత పరిస్థితుల దృష్ట్యా, ఓడరేవు ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించి, పరిస్థితిని నిశితంగా సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఈ నౌక, పోర్టుకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పీఎమ్ బెర్త్’ వద్ద లంగరు వేసి ఉంది. ఇందులో సుమారు 11,350 మెట్రిక్ టన్నుల ముడి చమురు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. నౌక నుంచి ముడి చమురును పూర్తిగా అన్‌లోడ్ చేసే ప్రక్రియ పూర్తయ్యేంత వరకు, సిబ్బందిలో ఎవరూ నౌకను విడిచి కిందకు దిగడానికి అనుమతి లేదని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు. మొత్తం 21 మంది పాకిస్తాన్ కు చెందిన సిబ్బందిని ఓడలోనే నిర్భందించారు.. అలాగే వారి పాస్ పోర్టులను కూడా మెరైన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.