వెలగపూడి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తిన బాట పట్టారు. ఈ సాయంత్రం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా దేశ రాజధానికి చేరుకుంటారు.
రెండు రోజుల పాటు అక్కడే ఉంటారని సమాచారం. ఈ క్రమంలో గురువారం సచివాలయంలో జరగాల్సిన మంత్రివర్గ సమావేశం సైతం వాయిదా పడినట్లు తెలుస్తోంది.దీనికి కారణాలు లేకపోలేదు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరు కావాల్సి రావడమే.
ఢిల్లీ కొత్త సిఎం ప్రమాణ స్వీకారం కోసం…
రేపు సాయంత్రం 4:30 గంటలకు రామ్‌లీలా మైదాన్‌లో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రులూ ప్రమాణం చేస్తారు. లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇదివరకే ఆహ్వానం అందింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలు అయినందున తెలుగుదేశం, జనసేన పార్టీల అధ్యక్షులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇందులో పాల్గొననున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్ ముఖ్యమంత్రులు దీనికి హాజరు కానున్నారు.
బాలీవుడ్ సెలెబ్రిటీలు అక్షయ్ కుమార్, వివేక్ ఒబెరాయ్, ఎంపీ హేమామాలిని, కిరణ్ ఖేర్ దీనికి హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలట్లేదు. నేడు ముఖ్యమంత్రి పేరును బీజేపీ అధికారికంగా ప్రకటించనుంది. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు బీజేపీ శాసనసభా పక్షం భేటీ కానుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ అధినాయకుడిని ఎన్నుకుంటారు. కొత్త సీఎంగా పర్వేష్ వర్మ పేరు దాదాపుగా ఖరారు కావొచ్చు. విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ, పవన్ శర్మ, ఆతిషి సూద్, రేఖా గుప్తా పేర్లు సైతం వినిపిస్తోన్నాయి.