rs.1lakh loss | పాలడుగులో వరి కొయ్యలకు నిప్పు…రైతు ఏడాది కష్టం బూడిద

rs.1lakh loss | పాలడుగులో వరి కొయ్యలకు నిప్పు…రైతు ఏడాది కష్టం బూడిద
rs.1lakh loss | వరి కొయ్యల మంటలతో చెలరేగిన ప్రమాదం
కళ్లముందే దగ్ధమైన మోటార్లు, స్టార్టర్లు
అప్రమత్తమైన గ్రామస్తులతో తప్పిన భారీ ప్రమాదం
వరి కొయ్యలకు నిప్పుతో పెరుగుతున్న అగ్నిప్రమాదాలు
rs.1lakh loss | మోత్కూరు, ఆంధ్రప్రభ : ఎండలు మండిపోతున్న వేళ… పంట కోసుకుని కొంత ఊపిరి పీల్చుకోవాలనుకున్న రైతు కుటుంబంపై అగ్ని ప్రమాదం రూపంలో మరో కష్టం పడింది. కష్టపడి సాగు చేసిన పొలం పక్కనే ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలు… రైతు కళ్లముందే వ్యవసాయ పరికరాలను బూడిదగా మార్చేశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన రైతు కుటుంబాలను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
గ్రామానికి చెందిన బరిగెల పుల్లయ్య, హేమలతకు చెందిన వరి పొలం సమీపంలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి దాదాపు కిలోమీటర్ దూరంలో ఎవరో ఆకతాయిలు వరి కొయ్యలకు నిప్పు పెట్టినట్లు సమాచారం. అయితే వేసవి గాలులు తీవ్రంగా వీయడంతో ఆ మంటలు ఒక్కసారిగా విస్తరించి పొలాల మీదుగా పుల్లయ్య, హేమలత వ్యవసాయ భూమి వరకు చేరుకున్నాయి.
మంటలు వేగంగా వ్యాపించడంతో వ్యవసాయ బావి వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్, స్టార్టర్, ఫ్యూజ్‌లు, కేబుల్ వైర్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. కొద్దిసేపట్లోనే రైతు కుటుంబం ఆధారపడే ముఖ్యమైన వ్యవసాయ పరికరాలు కాలిపోయి కనిపించడంతో బాధితులు కన్నీరు పెట్టుకున్నారు.

“పంట పండించుకోవడమే కష్టం… ఇప్పుడు మోటార్లు, వైర్లు మళ్లీ కొనాలంటే ఎలా?” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.1 లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.
మంటలను గమనించిన స్థానిక రైతులు, గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై నీరు, మట్టి సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. లేదంటే మంటలు మరిన్ని పొలాలకు వ్యాపించి భారీ విపత్తు జరిగేదని గ్రామస్తులు చెబుతున్నారు.
ఈ ఘటన తర్వాత గ్రామంలో మరోసారి రైతుల ఆందోళన బయటపడింది. వరి కొయ్యలకు నిప్పు పెట్టడం వల్ల తరచూ ఇలాంటి అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని… గడ్డివాములు, మోటార్లు, వ్యవసాయ పరికరాలు కాలిపోతూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు వాపోతున్నారు.
ఒకవైపు ప్రకృతి కష్టాలు… మరోవైపు నిర్లక్ష్యంగా పెట్టే మంటలు…
ఈ రెండింటి మధ్య రైతు జీవితం మళ్లీ అగ్నిపరీక్షగానే మారుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
click here to read డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఆటో..
