Sangareddy |కడుపునొప్పితో వెళ్తే… ఆపరేషన్ తో యువ‌తి మృతి…

Sangareddy | కడుపునొప్పితో వెళ్తే… ఆపరేషన్ తో యువ‌తి మృతి…

  • హాస్పిటల్ ముందు ఉద్రిక్తత…

Sangareddy | అమీన్ పూర్, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలోని తిరుమల హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం మరొక ప్రాణాన్ని బలి తీసుకుందనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. చిన్న సమస్యతో ఆసుపత్రికి వెళ్లిన ఓ యువతి, సర్జరీ పేరుతో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే… వందనపురి కాలనీకి చెందిన హారిక (28) అనే మహిళ కడుపు నొప్పితో గురువారం రాత్రి 8గంటల సమయంలో తిరుమల ఆసుపత్రిలో చేరింది. సాధారణ పరీక్షల తర్వాతే వైద్యులు తక్షణం సర్జరీ చేయాలని సూచించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఆమెను రాత్రి 9 గంటల సమయంలో ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లగా, కొద్ది సేపటికే ఆపరేషన్ వికటించి హారిక మృతి చెందినట్లు సమాచారం. గంటలోపే పరిస్థితి విషమించడంపై కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన బంధువులు ఆసుపత్రి ఎదుట భారీగా ఆందోళనకు దిగారు.

Sangareddy

“సాధారణ నొప్పికి సర్జరీ ఎందుకు?” అంటూ వైద్యులపై తీవ్ర విమర్శలు చేసారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే ఈ మృతికి కారణమని ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మొహరించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పరిస్థితిని నియంత్రించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply