టీచరుగా, వ్యాయామ ఉపాధ్యాయురాలిగా మారిన జిల్లా కలెక్టర్..

టీచరుగా, వ్యాయామ ఉపాధ్యాయురాలిగా మారిన జిల్లా కలెక్టర్..

10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి…
రెమిడియల్ క్లాసులను ఆకస్మికంగా తనిఖీ…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి  సూచించారు.బుధవారం పట్టణంలోని కే.ఎన్.ఎం. మున్సిపల్ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న ఎస్ఎస్సి రెమిడియల్ క్లాసులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక తరగతుల నిర్వహణ విధానం, విద్యార్థుల హాజరు, బోధన పద్ధతులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారి చదువుల పురోగతి, సబ్జెక్టుల వారీగా ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. కొద్దిసేపు టీచర్ గా మారి విద్యార్థులకు చదువు చెప్పటం విశేషం.

పదవ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా బోధన చేయాలని పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులను ఆదేశించారు. ముఖ్యంగా తెలుగు మరియు సైన్స్ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు అదనపు శిక్షణ అందించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో 10వ తరగతి ఫలితాల్లో 84 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. అయితే 3,375 మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని తెలిపారు. వీరిలో కొంతమంది అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ కావడం ఆందోళనకరమన్నారు.

అలాంటి విద్యార్థులు కూడా సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రెమిడియల్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి విద్యార్థి స్థాయిని గుర్తించి, వారికి అవసరమైన విధంగా సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో బోధిస్తున్నారని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ కోరారు. సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులను సెల్‌ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచి, ఇంటి పనులు చెప్పకుండా చదువుకు అనుకూల వాతావరణం కల్పించాలని సూచించారు. 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన మలుపు అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తే జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా గ్రౌండ్లో విద్యార్థులతో క్రికెట్ ఆట ఆడి వారితో ఉత్సాహం నింపారు. బ్యాట్ తీసుకుని క్రికెట్ ఆట ఆడి వారిలో చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డి ఈ ఓ, డిటి.శంకర్ ప్రసాద్, హెచ్ఎం ఉపాధ్యా యులు పాల్గొన్నారు.

Leave a Reply