రైతులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలి..

  • ఉమ్మడి జిల్లాల రైతు రక్షణ సమితి అధ్యక్షుడు హింగె భాస్కర్..

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : మొంథా తుఫాన్‌ కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరకాల పర్యటనలో స్పష్టమైన ప్రకటన చేయాలని ఉమ్మడి జిల్లాల రైతు రక్షణ సమితి అధ్యక్షుడు హింగే భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో రైతు రక్షణ సమితి నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత ఏడాది మొంథా తుఫాన్‌ ప్రభావంతో పంటలు నష్టపోయిన ఉమ్మడి హనుమకొండ, కరీంనగర్‌ జిల్లాల పరిధిలోని రైతులందరికీ వెంటనే నష్టపరిహారం అందించాలని కోరారు. తుఫాన్‌ కారణంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా పంట నష్టపోయారని, సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించి అండగా నిలవాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరకాలకు వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా రైతుల పంట నష్టపరిహారం అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే నిర్వహించిన పంట నష్టం సర్వే వివరాలను సమీక్షించి, అర్హులైన ప్రతి రైతుకు పరిహారం అందించాలని తెలిపారు.

పంట నష్టం సర్వేలో అర్హులైన రైతుల పేర్లు నమోదు కాకపోతే మరోసారి అవకాశం కల్పించాలని, ఎలాంటి వివక్ష లేకుండా నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేయాలని కోరారు. నష్టపరిహారం ఎప్పుడు విడుదల చేస్తారనే అంశంపై ముఖ్యమంత్రి పరకాల పర్యటనలో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రకృతి వైపరీత్యాలతో పంటలు కోల్పోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని హింగే భాస్కర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి, మొంథా తుఫాన్‌ నష్టపరిహారాన్ని ఇక ఆలస్యం చేయకుండా రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. రైతులకు కేవలం హామీలు కాకుండా తక్షణ ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు.

రైతుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రైతు రక్షణ సమితి నిరంతరం రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని హింగే భాస్కర్‌ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా సలహాదారుడు సుకినే సుధాకర్‌రావు, జిల్లా కార్యదర్శి అంబిర్‌ శ్రీనివాస్‌, మండల అధ్యక్షుడు కొప్పు తిరుపతి, నాయకులు భాష వేన కుమార్‌, రాములు, రైతులు తదితరులు పాల్గొన్నారు.