కొండవీడులో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ…
యడ్లపాడు, ఆగస్టు 14( ఆంధ్రప్రభ): 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొండవీడులో శుక్రవారం ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.జడ్పీహెచ్‌ఎస్ కొండవీడు విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీ గ్రామంలో దేశభక్తి నినాదాలతో కొనసాగింది.జాతీయ జెండా గొప్పతనం, దేశభక్తి,జాతీయ సమైక్యతతో పాటు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం యొక్క ప్రాధాన్యతను విద్యార్థులు నినాదాలు, సందేశాల ద్వారా ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జెట్టి విజయశ్రీ, ఎంపీడీవో హేమలత పాల్గొని విద్యార్థులతో కలిసి ర్యాలీలో నడిచారు.ఈ సందర్భంగా తహసీల్దార్ విజయశ్రీ మాట్లాడుతూ ప్రతి భారతీయుడిలో దేశభక్తి భావనను మరింత బలపరిచేలా ‘హర్ ఘర్ తిరంగా’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని చాటాలని పిలుపునిచ్చారు.
ఎంపీడీవో హేమలత మాట్లాడుతూ జాతీయ కార్యక్రమాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొనడం అభినందనీయమన్నారు. చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో దేశభక్తి,బాధ్యత, జాతీయ విలువలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.జడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం అత్తలూరి మాధవి మాట్లాడుతూ… విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ,సామాజిక బాధ్యతను పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమన్నారు.పీఎస్ హెచ్‌ఎం సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ జాతీయ జెండా భారతదేశ గౌరవం,త్యాగాలు, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం లక్ష్మి, బీఎస్‌ఎల్ రాజు, జున్ను సాహెబ్, వైస్ చైర్మన్ కృష్ణవేణి, కరుణామణి,అనుషా,మురళీకృష్ణ,గ్రామ పెద్దలు,సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి ‘హర్ ఘర్ తిరంగా’కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు ప్రజలకు పిలుపునిచ్చారు.
